Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీని, పదవిని వీడిన కర్బూక్ ఎమ్మెల్యే
అగర్తల : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అధికార బీజేపీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీని మరొక ఎమ్మెల్యే వీడారు. అలాగే, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాదిలో త్రిపురలో అధికార పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఎమ్మెల్యేల రాజీనామాలు బీజేపీకి మింగుడుపడటం లేదనీ, ఇది ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు వివరించారు. కర్బూక్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ నాయకుడు బుర్బా మోహన్ త్రిపుర.. బీజేపీకి, తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుర్బా మోహన్ ఆదివాసీ పార్టీ టిప్రహ ఇండీజీనియస్ ప్రొగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా)లో చేరనున్నారు. టిప్రా చీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ప్రద్యొత్ బిక్రమ్ మాణిక్య దేవ్ బర్మాన్‌తో కలిసి ఎమ్మెల్యే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ రతన్ చక్రవర్తికి అందించారు. బుర్బా మోహన్ టిప్రాలో చేరే విషయాన్ని ప్రద్యొత్ బిక్రమ్ మాణిక్య బర్మాన్ ధ్రువీకరించారు. '' ఆయన (బుర్బా మోహన్) బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయనకు సంఘీభావం ప్రకటించటానికి ఆయనతో కలిసి నేను వచ్చాను. ఇప్పుడు ఆయన టిప్రాలో చేరుతారు'' అని దేబ్ బర్మాన్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. బుర్బా మోహన్ రాజీనామాతో 60 మంది సభ్యుల గల త్రిపుర అసెంబ్లీలో అధికార బీజేపీ బలం 35కు పడిపోయింది. కాగా, బుర్బా మోహన్ పార్టీకి రాజీనామా చేయటంపై ఏ ఒక్క బీజేపీ నాయకులూ అందుబాటులో లేకపోవటం గమనార్హం. గత ఏడాది నుంచి బీజేపీ రాష్ట్రంలో రాజీనామా దెబ్బలను ఎదుర్కొంటున్నది. బుర్మా మోహన్‌తో ఆ పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం నాలుగుకు చేరుకున్నది. ఇప్పటికే ఆశిస్ దాస్, మాజీ మంత్రి సుదీప్ రారు బర్మాన్, ఆశిస్ కుమార్ సాహా లు బీజేపీని వీడారు. వచ్చే ఏడాది మార్చిలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు అధికార పార్టీని ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వీడటం గమనార్హం.