Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం : డబ్ల్యూహెచ్వో
న్యూఢిల్లీ : ఒకరి నుంచి మరొకరికి సోకని (ఎన్సీడీ) క్యాన్సర్, మధుమేహం, గుండె, శ్వాసకోశ సంబంధిత..మొదలైన వ్యాధులు భారత్లో పెద్ద ఎత్తున మరణాలకు దారితీస్తోందని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' నివేదిక పేర్కొన్నది. భారత్లో సంభవించే మొత్తం మరణాల్లో 66శాతం ఎన్సీడీ వ్యాధులు కారణమవుతున్నాయని తెలిపింది. దీనివల్ల కోట్లాది మంది పని సామర్థ్యం పరిమితమవుతోందని, ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతోందని నివేదికలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఎన్సీడీ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకవు. ఎక్కువగా జీవనశైలికి సంబంధించినవి. గుండె, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మరణించినవారు సుమారుగా 60లక్షల మంది ఉంటారు. వీటిలో చాలావరకు నివారించదగినవి. మొత్తం 194దేశాల్లో ఎన్సీడీల ప్రాబల్యాన్ని పరిశీలిస్తూ డబ్ల్యూహెచ్వో నివేదిక రూపొందించింది. భారత్లో ఈ వ్యాధుల వల్ల అకాల మరణాల శాతం 22శాతంగా ఉందని హెచ్చరించింది. 30ఏండ్లు దాటిన వారిలో 22శాతం మంది హఠాత్తుగా మరణించే అవకాశాలున్నాయి. గుండె సంబంధిత సమస్యలు 28 శాతం మరణాలకు దారితీస్తోంది. 31శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 63శాతం మందిలో రోగ నిర్ధారణ సరిగా జరగటం లేదు. ఊబకాయ సమస్య పెరగటమూ మరో ముఖ్యకారణం. ఊబకాయ సమస్య పెరుగుదలను అరికట్టాలనే లక్ష్యానికి భారత్ దూరంగా వెళ్తోందని నివేదిక అంచనావేసింది. 18ఏండ్లు దాటినవారిలో శారీరక శ్రమ లేకపోవటం అన్నది ప్రపంచ సగటు 28శాతముంటే, భారత్లో 34శాతంగా నమోదైంది.