Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ:దేశ సంపదను, శ్రమజీవుల కష్టాన్నికొల్లగొట్టి, అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ సంస్థలకు కారు చౌకగా మోడీ ప్రభుత్వం కట్టబెడు తున్నదని ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. శుక్రవారం పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 31వ మహాసభలు దూద్కళాలో జరిగాయి. ఈ సభల్లో ఆయన మాట్లాడుతూ మోడీ అండతో అదాని ఆస్తి ఆకాశానికి అగబాగుతున్నదనీ, ప్రపంచంలో రెండవ పెద్ద సంపన్నుడిగా మారాడని విమర్శించారు. అతని వద్ద లక్షల కోట్లు పోగయ్యాయంటే, దేశంలోని ప్రజలు లక్షల కోట్లు కోల్పోయినట్లేనని అన్నారు. దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోదాముల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, నిత్యవసర వస్తువుల ధరలు మాత్రం నిత్యం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తులు విపరీతంగా పెరిగినప్పుడు, నిత్యవసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయని ఆయన ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ అభివృద్ధి అంటే, అదానీ, అంబానీ అభివృద్ధిగా అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మిక వర్గం మొత్తం కలిసి సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఇండిస్టీ అనే పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. లక్షలాది మందితో పార్లమెంట్ మార్చును నిర్వహించాలని ఆయన అన్నారు. అందుకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక సంఘము ఉండాలని ఏపిలో పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించి నిర్వహణ సారధ్యం వహిస్తే, పంజాబ్ రాష్ట్రంలో రైతాంగ ఉద్యమంతో పాటు ప్రత్యేకంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉండాలని హరికిషన్ సింగ్ సూర్జిత్ వ్యవసాయ కార్మికుల ఉద్యమాన్ని నిర్మించి నడిపారని అన్నారు. వారి స్ఫూర్తితో వ్యవసాయ కార్మిక ఉద్యమాలు సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.