Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలికాం బిల్లు ముసాయిదాపై కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు-2022 ముసా యిదాపై అక్టోబర్ 20 అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. శుక్రవారం నాడిక్కడ నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బిల్లు ముసాయిదాను వివరించారు. కొత్త టెలికాం బిల్లు 6-10 నెలల్లో అమల్లోకి వస్తుందని, అయితే ప్రభుత్వం ఈ విషయంలో తొందరపడడం లేదని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాక తుది ముసాయిదాను రూపొందిస్తామని వివరించారు. దాన్ని తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు. దీనికి సుమారు 6-10 నెలలు పడుతుందన్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం- 1885, ఇండియన్ వైర్లెస్ టెలీగ్రఫీ చట్టం- 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) చట్టం- 1950 స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకొస్తోంది.
ఇందులో భాగంగా ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. దీనిపై అక్టోబరు 20లోపు స్పందనలు తెలియజేయాలని కోరింది.
ఇంటర్నెట్ ద్వారా ఆడియో, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డుయో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు సైతం ఇకపై దేశీయంగా టెలికాం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ సదరు సంస్థలు లైసెన్సులను సరెండర్ చేసిన సందర్భంలో రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదనను కేంద్రం ఇందులో చేర్చింది.