Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం పేరుతో ప్రజల్లో విభజన
- జంతర్ మంతర్ ధర్నాలో సీపీఐ(ఎం) నేత బృందా కరత్
- హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ విధానాలతోనే దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బందా కరత్ విమర్శించారు. శనివారంనాడిక్కడ జంతర్ మంతర్ లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దేశం లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రయి వేటీకరణ, మతతత్వానికి వ్యతి రేకంగా ఆందోళన జరిగింది. జోరు వర్షంలోనూ ప్రజలు ఆందోళనలో కదలకుండా ఉంటూ, తమ నిరసనను తెలిపారు. గత మూడ్రోజులుగా భారీ వర్షాలున్నప్పటికీ వేలాది మంది ధర్నాకు హాజరయ్యారు. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, లోనీ, నోయిడా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి బృందా కారత్ మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల జేబుదొంగ ఆర్థిక నమూనా కార్పొరేట్లకు ప్రయోజనాలను, పేదలకు భారాలను పెంచిందని వివరించారు. ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య మతం పేరుతో విభజనను సష్టిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు పేదల రేషన్‌పై దాడి జరుగుతోందనీ, అలాగే పాలు, పిండి బియ్యం ప్యాకెట్లపై కూడా పన్ను విధించారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై భారీగా పన్ను విధిస్తున్నారనీ, మోడీ ప్రభుత్వం పేదల జేబులకు చిల్లు పెడుతోందని అన్నారు. కేరళ మోడల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ ప్రత్యామ్నాయ నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎం తివారీ, కార్యదర్శి వర్గ సభ్యులు బ్రజేష్, ఆశాశర్మ, రాజీవ్, సెహబా తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు: రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని, జీఎస్టీపేరుతో దోపిడీని ఆపాలని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నగర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి. అబ్బాస్ మాట్లాడారు. అధికారంలోకి వస్తే ధరలు నియంత్రిస్తామని, నల్లధనం బయటకు తెస్తామని 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మోడీ అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటుపరం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు మోడీ సర్కార్ దోచిపెడుతోందని విమర్శించారు. రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తుండగా పోలీసులు సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి సైదాబాద్ పీఎస్‌కు తరలించారు. రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్‌లో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీపీఐ(ఎం) బాలానగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాప్రా తహసీల్దార్ ఆఫీసు ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం పాల్గొన్నారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ధర్నా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టారు. నిజామాబాద్, బోధన్‌లో ఆర్డీవో కార్యాలయాల ఎదుట, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, వర్ని, మాక్లూర్ తదితర మండలాల్లో తహసీల్ కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పట్టణ, మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిం చారు. భద్రాచలంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మణు గూరులో పార్టీ జిల్లా కార్యదర్శి కన్నవరపు కనయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతి అందజేశారు. సుజాతనగర్లో రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి, వినతి అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. కరీంనగర్, వికారాబాద్, వరంగల్, నర్సంపేట, స్టేఫన్ఘనపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, తదితర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలుకు ప్రజలు కదిలివచ్చారు.