Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 8 లక్షల కోట్లు అవుట్
- క్రమంగా తరిగిపోతున్న నిధులు
- తొమ్మిది నెలల దిగుమతులకు సరిపడ నిధులు
- ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ చర్యలు నిల్
న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వలు క్రమంగా అడుగంటి పోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, ఎగుమతులతో పోల్చితే దిగుమతులు భారీగా పెరగడం, విదేశీ చెల్లింపులు తదితర అంశాలు మారకం నిధులు కర్పూరంలా కరిగిపోయేలా చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా గణంకాల ప్రకారం.. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకం నిల్వలు 5.22 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33,300 కోట్లు) తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందులో కరెన్సీ ఆస్తులు అత్యధికంగా 4.70 బిలియన్ డాలర్ల మేర దేశం నుంచి తరలిపోయాయి. మరోవైపు పసిడి నిల్వలు 458 మిలియన్ డాలర్ల మేర తరిగి 38.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఏడాది మార్చి చివరి నాటికి 616 బిలియన్ డాలర్లున్న విదేశీ మారక నిల్వలు ఊహించని రీతిలో శరవేగంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 9 నెలల దిగుమతులకు సరిపడా ఫారెక్స్ నిల్వలు మన వద్ద ఉన్నాయని అంచనా.
2021 అక్టోబరులో 642 బిలియన్ డాలర్ల నిల్వలుండగా, ఈనెల 16 నాటికి 545.65 బిలియన్లకు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. కేవలం ఏడాది కాలంలో 96.45 బిలియన్లు (దాదాపు రూ.8 లక్షల కోట్లు) మేర తగ్గిపోయంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల్ని తరలించుకుపోవడం, ముడి చమురు దిగుమతులకు డాలర్ల చెల్లింపులు అధికం కావడం కూడా మారకం నిల్వల క్షీణతకు ప్రధాన కారణం. ఈ ఏడాది భారత్ విదేశీ మారక నిల్వలు మరింత పడిపోతాయని డ్యూషే బ్యాంక్ ఇటీవల హెచ్చరించింది. తాజాగా రూపాయి 81 స్థాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశం వద్దనున్న విదేశీ మారకపు నిల్వలు 8.9 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని అంచనా. రూపాయి విలువను 80కి దిగువన ఉంచడానికి ఆర్బిఐ చేసిన ప్రయత్నంలో మారకం నిల్వలు భారీగా తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయినా రూపాయి విలువ పటిష్టం కాకపోవడంతో వేగంగా నిల్వలు తరిగిపోవడంతో ఆర్బిఐ చేసేదేమీ లేక చేతులెత్తేసిందని భావిస్తున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోవడానికి భారత్ వద్ద చర్యలు తీసుకుంటుందన్న ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న కొన్ని వారాల్లోనే లక్షల కోట్ల మారకం నిల్వలు కరిగిపోవడం గమనార్హం.
100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐల రాక : కేంద్రం
ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు రావొచ్చని కేంద్రం పేర్కొంది. 2021-22లో 83.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో పోల్చితే మరింత పెరగనున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది ఎఫ్‌డీఐలు 101 దేశాల నుంచి వచ్చాయని పేర్కొంది. అనేక రంగాల్లో ఆటోమెటిక్ పద్దతిలో ఎఫ్‌డీఐలకు అనుమతులిస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. కాగా.. వరుసగా పడిపోతున్న విదేశీ మారకం నిల్వలు, ఎఫ్ఐఐలు భారీగా తరలిపోతుండటం, రూపాయి పతనం, మార్కెట్లలో ఒత్తిడి నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని నింపడానికి ఈ ప్రకటన చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.