Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకుడి కుమారుడు పుల్కిత్ ఆర్యపై సిట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడి కుమారుడి (పుల్కిత్ ఆర్య) క్రూరమైన చర్య బహిర్గతం కావటంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రుషికేష్‌లో హత్య జరిగిన రిసార్ట్‌కు శనివారం కొంతమంది నిరసనకారులు నిప్పుపెట్టారు. హత్య ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, కేసు వివరాలు బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వందలాదిమంది రిసార్ట్ వద్దకు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును త్వరితగతిన దర్యాప్తు చేస్తామంటూ సిట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 19ఏండ్ల యువతి హత్య కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు (రిసార్ట్ యజమాని) పులకిత్ ఆర్య, మరో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసులో ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ ముగ్గుర్ని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మరోవైపు కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి రావటంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
రిసార్ట్‌కు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని యువతిపై యజమాని పుల్కిత్ ఆర్య ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్టు ఆమె ఫేస్బుక్ స్నేహితుడు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. హత్యకు గురికావడానికి ముందు..తన స్నేహితుడికి ఫోన్ చేసి, తాను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్టు సమాచారం. తన కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఇప్పటికే యువతి తండ్రి కూడా ఆరోపించారు. హత్య ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. ''యువతి అంకితా భండారీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపట్ల నేను ఎంతగానో వేదనకు గురయ్యాను. బాధ్యులైనవారిని అత్యంత కఠినంగా శిక్షించాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ ఉన్నతాధికారి నేతృత్వంలో 'సిట్' విచారణను ఏర్పాటు చేస్తూ విచారణ జరపాలని నిర్ణయించాం. ఇది చాలా సీరియస్ అంశం. కేసు విచారణ లోతుగా జరపాలని తెలిపా''మని అన్నారు.
అసలేం జరిగింది?
రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యకు చెందిన వంతారా రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా అంకితా భండారీ పనిచేస్తోంది. గత ఆదివారం (సెప్టెంబర్ 18న) అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదుచేశారు. పులకిత్ ఆర్య కూడా ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చి రిసెప్షనిస్ట్ కనిపించటం లేదని ఫిర్యాదుచేశాడు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు పులకిత్ ఆర్యపై అనుమానం వ్యక్తం చేశారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అంకిత భండారీని పులకిత్ ఆర్య హత్యచేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. లైంగికదాడి అనంతరం యువతిని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆరు రోజుల తర్వాత శనివారం యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పులికిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని శనివారం బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది.