Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటతడిపెట్టిస్తున్న అంకిత వాట్సాప్ సందేశం
రిషికేష్ : ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన అంకిత భండారి వాట్సాప్ సందేశాలు పలు కీలకమైన, దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ''వారు నన్ను వ్యభిచారిగా మార్చాలనుకుంటున్నారు.'' అని బాధితురాలు తన స్నేహితురాలికి సందేశం పంపింది. సీనియర్ బిజెపి నేత కుమారుడి రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె తాను ఎదుర్కొన్న కష్టాలను కన్నీళ్లు తెప్పించేలా.. ఆ సందేశంలో వివరించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్ అవుతున్నాయి. వివిఐపి క్లయింట్లతో 'స్పా' ముసుగులో వ్యభిచారం చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అందుకు రూ.10వేలు ఇస్తామన్నారని అంకిత తెలిపారు. రిసార్ట్‌లో ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకుతున్నాడని ఆమె తెలిపింది. ఫోన్లో ఏడుస్తూ తన బ్యాగ్‌ను మెట్లపైకి తీసుకురమ్మని మరో వ్యక్తికి చెబుతున్న ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. హత్య జరిగిన రోజు రాత్రి 8.30 తర్వాత అంకిత ఫోన్ అందుబాటులో లేకుండా పోయిందని ఆమె స్నేహితుడు తెలిపారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవకపోవడంతో, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యకి ఫోన్ చేశానని, బహుశా ఆమె రూమ్‌కి వెళ్లిపోయి నిద్ర పోయి వుంటుందని చెప్పాడన్నారు. ఆ మరుసటి రోజు కూడా మళ్లీ ఫోన్ చేస్తే పుల్కిత్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రిసార్ట్ మేనేజర్‌కి ఫోన్ చేస్తే ఆమె జిమ్‌లో వుందన్నారు.
రిసార్ట్‌ను తగలబెట్టిన స్థానికులు
చట్టవిరుద్ధంగా నిర్మించిన రిసార్ట్‌లోని కొంత భాగాన్ని శుక్రవారం రాత్రి అధికారులు కూల్చివేశారు. స్థానికులు రిసార్ట్‌లోని మిగతా ప్రాంతాన్ని శనివారం ఉదయం తగలబెట్టారు. రిసార్ట్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక బిజెపి ఎమ్మెల్యే రేణు బిష్త్ కారు ధ్వంసం
స్థానిక బిజెపి ఎమ్మెల్యే రేణు బిష్త్ కారును స్థానికులు శనివారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. పోలీసులు ఆమెను సురక్షితంగా తరలించారు. శుక్రవారం నిందితులను కోర్టుకు తరలిస్తుండగా, కోపోద్రిక్తులైన స్థానికులు పోలీసుల వాహనంపై దాడి చేసింది. కారు అద్దాలు పగలగొట్టి, ముగ్గురు నిందితులను కొట్టారు.