Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్సిడీలకు కోతలు, ప్రజా పంపిణీలోనూ మార్పులు
- సమూల మార్పులంటూ కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం
- రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ సర్కార్ లేఖలు
''ఆహార పంటల కొనుగోళ్ల ప్రక్రియను ప్రయివేటు కంపెనీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల సేకరణలో 6 నుంచి 8శాతం నిర్వహణ ఖర్చుల కింద రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఇది చాలా ఎక్కువ. ఇవ్వాల్సిన అవసరం లేదు. 2శాతం ఇస్తే చాలు'' అని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సులో చెప్పారు. పంట కొనుగోళ్లు, ఆహార నిల్వల నిర్వహణ, పంపిణీలో సమూల మార్పులు చేపట్టాలని ఆయన మోడీ సర్కార్‌కు నివేదిక పంపారు. పంట కొనుగోళ్లలోకి ప్రయివేటును తీసుకొస్తున్నామని, ఇందుకు సన్నద్ధం కావాలని గోధుమ మిల్లర్ల అసోసియేషన్‌కు తెలియజేశారు.
న్యూఢిల్లీ : ఆహారరంగాన్ని..ముఖ్యంగా పంట కొనుగోళ్లు, ప్రజా పంపిణీ అంతా కూడా ప్రయివేటు చేతిలో పెట్టేందుకు విధివిధానాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడున్న విధానాన్ని సమూలంగా రద్దు చేసి...కొత్త విధానం తీసుకురావాలని కేంద్రంలో ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఏడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో గోధుమ సేకరణ అంతా ప్రయివేట్ ట్రేడర్స్‌కు కేంద్రం అప్పజెప్పింది. ఇలా సేకరించిన గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా ట్రేడర్స్‌కు అనుకూలంగా వ్యవహరించింది. మరోవైపు ప్రభుత్వ గోడౌన్లలో నిల్వలు లేవనే సాకుతో దేశమంతా రేషన్ సరుకుల పంపిణీలో గోధుమల స్థానంలో బియ్యాన్ని పంపిణీ చేసింది. దాంతో అనేకమంది గోధుమల కోసం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. పంట సేకరణలో మోడీ సర్కార్ ఎంచుకున్న ఈ విధానం గోధుమ ధరల పెంపునకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేషన్ డిపోల ద్వారా పంపిణీ లేకపోవటం వల్ల ఉత్తరాదిన అనేకమంది బహిరంగ మార్కెట్లో గోధుమ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాంతో డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లోనూ ప్రయివేటు ట్రేడర్స్‌కు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని సుధాంశు పాండే సంకేతాలు పంపారని తెలిసింది. ప్రభుత్వ సేకరణలోనూ ప్రయివేటు ట్రేడర్స్‌కు భాగస్వామ్యం కల్పించాలని చూస్తున్నట్టు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు పంపిందని ఆయన అన్నారట.
సంక్షోభాన్ని సాకుగా చూపి..
ఆహార సంక్షోభం దేశాన్ని చట్టుముట్టే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితిని సాకుగాచూపి మోడీ సర్కార్ మరో సంచలన, ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశముందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ సంక్షోభాన్ని సాకుగా చూపి కేంద్రం అత్యంత వివాదాస్పద సాగు చట్టాలు చేసింది. ప్రజా ఆందోళనతో వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. కార్మికశక్తిని దెబ్బతీయడానికి, కార్పొరేట్లకు బలం చేకూర్చేందుకు లేబర్‌కోడ్స్‌ను చేసింది. ఆర్థికమాంద్యం అడ్డుపెట్టుకొని..అత్యంత ధనికులకు, బడా కార్పొరెట్లకు పన్ను ప్రయోజనాలు భారీఎత్తున ప్రకటించింది. విధానపరంగా కేంద్రం చేపట్టిన ఈ చర్యలు ఈ దేశ ప్రజల్ని ఎంత దారుణంగా దెబ్బకొట్టాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా ప్రజల గగ్గోలు పట్టించుకోకుండా..మరో సంచలన నిర్ణయంతో మోడీ సర్కార్ సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మందుగా సబ్సిడీలకు కోత
దేశవ్యాప్తంగా ఆహార సబ్సిడీలపై కోతలు పెట్టాలని, రాష్ట్రాలను సైతం ఆ దిశగా వెళ్లేట్లు ఒత్తిడి తేవాలని కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజా పంపిణీలో సమూల మార్పులు చేసే అవకాశముంది. ధాన్యం సేకరణ నుంచి క్రమంగా కేంద్రం తప్పుకుంటోంది. ఇది రైతుల పంటసాగుపై తీవ్ర ప్రభావం చూపింది. అందువల్లే ఈ ఏడాది ఖరీప్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 6శాతం తగ్గింది. గత ఏడాదితో 2022లో పోల్చితే కందులు, పెసర్లు, మినుముల పంట దిగుబడులు తగ్గాయి. నూనెగింజల దిగుబడి కూడా గణనీయంగా(30లక్షల టన్నులకుపైగా) పడిపోయింది. ప్రభుత్వ గోడౌన్లలో ఆహార నిల్వలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాడి ఆగస్టునాటికి 788.7 టన్నుల నిల్వలుంటే, ఈ ఏడాది అవి 495 లక్షల టన్నులకు పడిపోయాయి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సజ్జలు..మొదలైనవన్నీ కలుపుకొని ఈ గణాంకాల్ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైంది గోధుమ నిల్వల్లో దాదాపు 2.9కోట్ల టన్నుల (37శాతం) తగ్గుదల నమోదైంది.
పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్దిదారులకు ఇస్తున్న 5కిలోల ఉచిత బియ్యం అక్టోబర్‌లో కొనసాగుతుందా ? లేదా ? అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆహార పంట ఉత్పత్తుల సేకరణ తగ్గించుకోవాలని, తద్వారా నిల్వలు కనిష్టస్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది.