Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతిలో డాక్టర్‌తో సహా ఆయన ఇద్దరు పిల్లలు దుర్మరణం
తిరుపతి : తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది ఈ సంఘటనలో డాక్టర్‌తో పాటు, ఆయన ఇద్దరు పిల్లలు మరణించారు. రేణిగుంట పట్టణం భగత్‌సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవిశంకర్‌రెడ్డి (55) ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబం ఆ ఆస్పత్రి భవనంలోనే పైఅంతస్తులో నివాసముంటోంది. ఆ అంతస్తులోనే ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో తిరుపతి అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు రవిశంకర్‌రెడ్డి భార్య అనంతలక్ష్మిని, ఆయన తల్లి రామసుబ్బమ్మను కాపాడారు. అగ్నిమాపక అధికారులు అతికష్టమ్మీద వైద్యుడి కుమారుడు భరత్ (11), కుమార్తె కార్తీక (6)లను పైఅంతస్తు నుంచి కిందికి దించారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. చికిత్సపొందుతూ వారిద్దరూ మృతి చెందారు. డాక్టర్ రవిశంకర్‌రెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే కుమార్తె పవిత్ర రెడ్డి, ఎంపిపి హరిప్రసాద్‌రెడ్డి వచ్చారు. వైద్యుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరుఫున ఆర్థిక సాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.