Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ : చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆదివారంనాడు 93వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ''స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి ఈనెల 28న జరుపుకుంటున్నాం. భగత్ సింగ్‌కు ఘన నివాళిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఛండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాను'' అని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని, వారి ఆదర్శాలతో వారి కలల భారతదేశాన్ని నిర్మిద్దామని చెప్పారు. కాకినాడలో గణపతి నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎన్ఎస్ఎస్ నుంచి ఐదు వేల మంది యువకులకు 30 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ను సేకరించారని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాలకు (మెరైన్ ఎకోసిస్టమ్స్) వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయని అన్నారు. చీతాలు తిరిగి రావడంపై 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగి పోతున్నాయని, చీతాలను ఎప్పటికప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందని, వాటిని జనం ఎప్పుడు చూసేందుకు అవకాశం ఉంటుందనేది ఆ టాస్క్ఫోర్క్ నిర్ణయిస్తుందని చెప్పారు. ''పండగల సీజన్ ప్రారంభం అయింది. అక్టోబర్ 2న బాపు జయంతి సందర్భంగా 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలి. పరిశుభ్రతను పాటిస్తూ పండుగల్లో హానికరమైన పాలిథిన్ చెత్తను వేయడం కూడా మన పండుగల స్ఫూర్తికి విరుద్ధం. అందుకని మనం స్థానికంగా తయారు చేసిన నాన్ ప్లాస్టిక్ బ్యాగులనే వాడాలి'' అని అన్నారు.