Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా భగ్గుమన్న నిరసనలు..
డెహ్రాడూన్ : బేటీ బచావో..బేటీ పడావో అంటూ పాలకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దేశంలో బాలికలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్య ఘటనపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కుమారుడు పులకిత్ ఆర్య, మరో ఇద్దరికి కఠిన శిక్ష విధించాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. నిరసనలు, ఆందోళనల నడుమ ఆదివారం అంకిత్ భండారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్ రిసెప్షనిస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తన కుమారుడు పులకిత్ ఆర్య అమాయకుడని బీజేపీ తాజా మాజీ నేత వినోద్ ఆర్య చెబుతున్నారు. పులకిత్‌పై ఉన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ''అతను(పులకిత్ ఆర్య) మామూలు వ్యక్తి. అతనికి తన పని మీదే శ్రద్ధ. పులకిత్‌కు, హతురాలు అంకిత భండారికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అతను (పులకిత్) ఇలాంటి పనుల్లో ఎప్పుడూ తలదూర్చలేదు. మా నుంచి పులకిత్ చాలా కాలంగా విడిగా నివసిస్తున్నాడు'' అని వినోద్ ఆర్య అన్నారు. అంకిత భండారీ హత్య కేసులో తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడిన తరుణంలో వినోద్ ఆర్య, నిందితుడి సోదరుడు అంకిత్ ఆర్యలను బీజేపీ బహిష్కరించిన విషయం విదితమే. ఆ తర్వాతి రోజే వినోద్ ఆర్య పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. దర్యాప్తు పాక్షికంగా, సమగ్రంగా జరగాలనే ఉద్దేశంతో తానే పార్టీకి రాజీనామా చేశానని వినోద్ ఆర్య చెప్పారు. రిషికేశ్‌లో పులకిత్‌కు చెందిన రిసార్ట్‌లో అంకిత భండారీ (19) రిసెప్షనిస్టుగా పని చేసేది. ఈ కేసులో పులకిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరబ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలు శుక్రవారం అరెస్టయ్యారు.