Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో కేటాయించినా విడుదల చేయని గుజరాత్ సర్కారు
- మోడీ సొంత రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
- గోశాలలను నిర్వహించే చారిటబుల్ ట్రస్టుల ఆగ్రహం
- ఆవులను వేల సంఖ్యలో రోడ్ల మీదకు విడిచిపెట్టి నిరసన
- బీజేపీనీ, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణపై ప్రసంగాలిచ్చే బీజేపీ.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గోవుల సంరక్షణపై మాట్లాడే హక్కు తమకే ఉన్నదని చెప్పుకేనే ఆ పార్టీ.. తాము పరిపాలించే రాష్ట్రాల్లో మాత్రం ఈ అంశాన్ని గాలికొదిలేస్తున్నది. ఇందుకు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్ ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ బడ్జెట్లో గోశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదు. దీంతో ఆ గోశాలలను నడుపుతున్న చారిటబుల్ ట్రస్టులు గుజరాత్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. వేల సంఖ్యలో ఆవులను రోడ్లపైకి స్వేచ్ఛగా వదిలేసి తమ నిరసనను తెలిపాయి. ఇటు బీజేపీని, రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్రను చేపడతామని హెచ్చరించాయి.
రాష్ట్రంలో వీధి పశులు దాడులు తీవ్ర సమస్యగా పరిణమించింది. గతనెలలో మెహ్సానా జిల్లా కడి పట్టణంలో నిర్వహించిన బీజేపీ తిరంగా యాత్రలో గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌పై ఆవు దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై వీధి ఆవులు దాడి చేయటం గమనార్హం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 1750 గోశాలలను చారిటబుల్ ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. 4.5 లక్షలకు పైగా పశువులకు ఇవి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే, నిధులను విడుదల చేయక మీనమేషాలు లెక్కిస్తున్న గుజరాత్ ప్రభుత్వ తీరుపై చారిటబుల్ ట్రస్టులు ఆగ్రహంతో ఉన్నాయి. దీంతో నిరసనల్లో పాల్గొన్నాయి. అలాగే, రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని చారిటబుల్ ట్రస్టులు పిలుపునిచ్చాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఆవులు..
సోషల్ మీడియాలో వైరల్
చారిటబుల్ ట్రస్టులు ఆవులను స్వేచ్ఛగా విడిచి పెట్టటంతో అవి ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కోర్టులు, సబ్‌డివిజనల్ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఆవులు వచ్చిన దృశ్యాలను పలువురు ట్విట్టర్ వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయటంతో అవి వైరల్‌గా మారాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చారిటబుల్ ట్రస్టులు దాదాపు పదివేల ఆవులను రోడ్ల మీదకు విడిచిపెట్టాయని తెలిసింది. ఆవుల విడుదలతో ఇటు ఉత్తర గుజరాత్ రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాగా, నిరసనల్లో పాల్గొన్నవారిలో దాదాపు 70 మందిని బనాస్కాంతా, పటాన్, కుచ్ జిల్లాల నుంచి నిర్బంధంలోకి తీసుకున్నారని గుజరాత్ గో సేవా సంఫ్‌ు తెలిపింది. ఇలాంటి ఆందోళనలే సౌరాష్ట్ర, మధ్య గుజరాత్ జిల్లాల్లో చోటు చేసుకొనే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా గో అధికార్ యాత్ర
గోశాలలు, వయసుమీరిన పశువుల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి గో మాతా పోషణ్ యోజన కింద గుజరాత్ ప్రభుత్వం బడ్జెట్లో రూ. 500 కోట్లను కేటాయించింది. '' మేము మోసపోయినట్టుగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు వాగ్దానాలు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయీ విడుదల కాలేదు. మరోపక్క, విరాళాలు తగ్గాయి. ప్రభుత్వం బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించినందున తామెందుకు ఇవ్వాలని దాతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీనీ అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని మేము ఇప్పటికే చెప్పాం. ఈనెల 30 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా గో అధికార్ యాత్రను చేపడతాం'' అని గుజరాత్ గో సేవా సంఫ్‌ు జనరల్ సెక్రెటరీ విపుల్ మాలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బనాస్కాంతాలోని థరాడ్ నుంచి అక్టోబరు 1న యాత్రను ప్రారంభిస్తామని సంఘ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ యాత్రలో వందలాది మంది మత నాయకులు, గోభక్తులు పాల్గొంటారని చెప్పింది. '' ఈ యాత్ర ఐదు జోన్లుగా ఉంటుంది. ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేయబోయే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ ఈ యాత్ర తాకుతుంది. నిధుల విడుదల జరిగే వరకూ మహంత్‌లతో నిరసన యాత్ర జరుగుతుంది'' అని సంఫ్‌ు తెలిపింది.
ఇటు వీధి పశువుల నియంత్రణ, రోడ్ల పరిస్థితిని మెరుగుపర్చటంలో విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వం ధిక్కార పిటిషన్‌ను ఎదుర్కొంటున్నది. కాగా, ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించటానికి బనాస్కాంత్ నుంచి కొంత మంది బీజేపీ నాయకులు గాంధీనగర్‌కు చేరుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాఘవ్జీ పటేల్ మాట్లాడుతూ.. '' ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం దొరకాలని సీఎం నిజాయితీగా కోరుకుంటున్నారు. పాలనాపరమైన సమస్యల కారణంగా నిధులను విడుదల చేయలేకపోయాం'' అని చెప్పారు.
దాదాపు ఆరువేల పశువులు మృత్యువాత
కాగా, పట్టణ ప్రాంతాల్లో పశువుల తరలింపులకు లైసెన్స్, నియంత్రణ, నిషేధం కోసం ప్రతిపాదించిన బిల్లును సైతం గుజరాత్ సర్కారు ఇప్పటికే వెనక్కి తీసుకున్నది. మాల్దారి (పశువుల పెంపకందారుడు) సంఘం బిల్లులో విధించిన పశువులను స్వాధీనం చేసుకునే పద్ధతి, భారీ జరిమానాపై నిరసన వ్యక్తం చేయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పశువులలో గడ్డలు ఏర్పడే చర్మ వ్యాధి (లంపి స్కిన్ డిసీజ్) ఆందోళనకరంగా మారింది. ఈ కారణంగా గోశాలల యజమానుల నుంచి నిరసనలు వచ్చాయి. ఈ విషయంలో దేశంలోనే గుజరాత్ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రంలో 1.69 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. 5,800కు పైగా పశువులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతున్నది. గోరక్షణపై బీజేపీ నాయకులు చేసేవి ఎన్నికల స్టంట్లు మాత్రమేననీ, హిందువుల ఓట్లను పొందటానికే వారు ఇలాంటి ప్రకటనలు చేస్తారని పలువురు చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు చెప్పారు.