Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనిప్రదేశాల్లో వికలాంగుల పట్ల వివక్ష, వేధింపులు
'ఒక అంచనా ప్రకారం భారత్లో 3కోట్లమందికిపైగా వికలాంగులున్నారు. ఇందులో సగం మంది (కోటీ 50లక్షల మంది) వికలాంగులు ఉపాధి పొందినప్పటికీ, 30లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి కారణం పనిప్రదేశాల్లో వివక్ష, అవమానాలు, సరైన పని పరిస్థితులు లేకపోవటమే'
- శారీరక వైకల్యాన్ని ఎత్తిపొడుస్తూ మాటలు
- ఈక్వాలిటీ హ్యూమన్ రైట్స్ సర్వేలో 18 శాతం మంది వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తాజా సర్వే ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పనిప్రదేశాల్లో అయితే శారీరక లోపాన్ని ఎత్తిచూపుతూ 'కుంటోడు, గుడ్డోడు..' అంటూ పిలుస్తున్నారనీ, వివక్ష, వేధింపులకు గురిచేస్తున్నారని 'ఈక్వాలిటీ హ్యూమన్ రైట్స్' సర్వే పేర్కొన్నది. ఒక అంచనా ప్రకారం భారత్లో 3కోట్లమందికిపైగా వికలాంగులున్నారు. ఇందులో సగం మంది (కోటీ 50లక్షల మంది) వికలాంగులు ఉపాధి పొందినప్పటికీ, 30లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి కారణం పనిప్రదేశాల్లో వివక్ష, అవమానాలు, సరైన పని పరిస్థితులు లేకపోవటమని అధ్యయనం పేర్కొన్నది. ఈ సర్వేలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, వికలాంగుల్లో 1.19కోట్ల మంది మహిళలు, 1.49కోట్లమంది పురుషులు ఉన్నారు. ఇందులో చాలామంది ఉపాధిరంగంలోకి రావాలనుకుంటున్నారు. కానీ వీరు పని ప్రదేశాల్లో వివక్ష, వేధింపులకు గురవుతున్నారని సర్వే తెలిపింది. తమను సరైన విధంగా చూడటం లేదని, శారీరక వైకల్యం ఎత్తిచూపుతూ పిలుస్తున్నారని సర్వేలో పాల్గొన్న 18శాతం మంది వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావటం కోసం యాజమాన్యాలే చర్యలు చేపట్టాలని సర్వే సూచించింది. వికలాంగులు భారమనే భావనతో భారతీయ సమాజం ఉందని, దీనిని విద్యావేత్తలు, పాలకులు తొలగించాలని సర్వేలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
హక్కుల అమలు బాధ్యత పాలకులదే
వికలాంగుల చట్టాల అమలు ఏ విధంగా ఉన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ చేయాలని సర్వే సూచించింది. వికలాంగుల హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. వివక్షను అంతమొందించే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వికలాంగులు భారమనే భావన నుంచి ప్రయివేటు యాజమాన్యలను బయటపడేయాలి. లేదంటే వివక్ష, అసమానతలు, అవమానాలు.. వికలాం గుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.
ఉద్యోగ అర్హతలున్నా తీసుకోవటంలేదు
ఉపాధిరంగంలో ఇతరులతో సమానంగా వికలాంగు లకు వేతనాలు దక్కటం లేదు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఉద్యోగాల దరఖాస్తుకు వికలాంగుల్ని అనర్హులుగా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, గౌరవం..ఇవన్నీ సాధారణ పౌరులకేకాదు, వికలాంగులకూ వర్తిస్తాయని భారత రాజ్యాంగం పేర్కొంది. వికలాంగుల సంక్షేమం కోసం 2012లో కేంద్రం ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటుచేసింది. సంక్షేమం, వివిధ కార్యక్రమాల అమలు ఈ శాఖ పరిధిలోకి తెచ్చింది. వికలాంగుల హక్కుల చట్టం-2016, వికలాంగుల హక్కుల నిబంధనలు- 2017కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో వికలాంగులకు సమాన అవకాశాలు, సాధికారత కల్పిస్తూ ఈ చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చారు.