Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీలో లేనట్లే
- అధ్యక్ష బరిలో కొత్త ముఖాలు..!
- సచిన్‌కు ఇవ్వకుండా విజయవంతం
- ఆదివారం జరిగిన ఘటనపై ఖర్గేకి గెహ్లాట్ క్షమాపణ
న్యూఢిల్లీ : అనుకున్నదే జరిగింది. రాజస్థాన్ సీఎం పగ్గాలు సచిన్ పైలట్‌కు దూరం అయ్యాయి. అశోక్ గెహ్లాటే సీఎంగా కొనసాగబోతున్నాడు. అలాగే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ పోటీ నుంచి దూరం కానున్నారు. వీటిని రాజస్థాన్ ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాజస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్ అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకోవడంతో, అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రేసులో లేరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అక్కడ 2020లో జరిగిన గందరగోళమే మళ్లీ ఇప్పుడు నెలకొంది. నాడు సచిన్ తిరుగుబాటు చేస్తే, ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కనుసన్నల్లోనే ఆయన వర్గమే తిరుగుబాటు చేసింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాట్ వర్గంపై అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తే, ముఖ్యమంత్రి పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై జరిగిన పరిణామాలు రాజస్థాన్‌లో మరోసారి సంక్షోభాన్ని సృష్టించాయి. సచిన్ పైలట్‌కు సీఎం పగ్గాలు ఇవ్వొద్దని అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 93 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామా అస్త్రాన్ని సందించారు. అలాగే పరిశీలకులుగా వెళ్లిన సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను పక్కన పెట్టే వేరుగా సమావేశం నిర్వహించారు. దీంతో రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి చెందింది.
గెహ్లాట్ ప్రమేయం లేకుండా అలా జరగదు : ఖర్గే
అశోక్ వర్గం 'క్రమశిక్షణారాహిత్యం'గా వ్యవహరించిందని అజరు మాకెన్ అన్నారు. గెహ్లాట్ ప్రమేయం లేదని పేర్కొన్నప్పటికీ, అతని అనుమతి లేకుండా అలాంటి తిరుగుబాటు జరగదని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆదివారం జరిగిన ఘటనపై మల్లికార్జున ఖర్గేకి అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యేల సమాంతర సమావేశం, వారి తిరుగుబాటును ''తప్పు'' అని పేర్కొన్నారు. ''ఇది జరగకూడదు'' అని అన్నారు. దానితో తనకు సంబంధం లేదని కూడా అన్నారు. సోమవారం జైపూర్‌లోని మారియట్ హౌటల్ల్లో ఉన్న ఖర్గే, మాకెన్‌లను అశోక్ గెహ్లాట్ కలిశారు.
సోనియాకు నివేదిక
రాజస్థాన్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ ఢిల్లీకి చేరుకున్నారు. రాజస్థాన్ పరిణామాలపై తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించామని, ఆమె లిఖితపూర్వక నివేదికను కోరారని అజయ్ మాకెన్ తెలిపారు. ఆ నివేదికను పరిశీలించిన తరువాతే, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే కమల్‌నాథ్, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ప్రియాంక గాంధీ కూడా సోనియా గాంధీని కలిశారు.
గెహ్లాట్ వర్గం మూడు షరతులు
వారు నలుగురు అధిష్టానం వద్ద మూడు షరతులు ఉంచారు. మొదటి షరతు సీఎం ఎవరనేదానిపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చే తీర్మానం ఆమోదించబడినప్పటికీ, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తీర్మానంలో దీన్ని భాగం చేసి బహిరంగంగా ప్రకటించాలని కోరారు. ఇది ఎలా సమర్థనీయం? అలా చేయలేమని ఖర్గే, మాకెన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడకుండా, అందరితోనూ ఒకే సారి మాట్లాడలనే రెండో షరతు పెట్టారు. అందుకు పరిశీలకులు ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి కలవడం ఆనవాయితీ కాబట్టీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా, స్పష్టతతో మాట్లాడుతారని, గుంపుగా మాట్లాడితే కొంత మంది ఒత్తిడికి లోనవుతారని, వారు ఏది చెప్పాలనుకున్నా వారు స్వేచ్ఛగా చెప్పాలని తాము కోరుకుంటున్నామని ఖర్గే, మాకెన్ అన్నారు. సచిన్ పైలట్, అతని వర్గం నుంచి ఎవ్వరూ ముఖ్యమంత్రి కారని తీర్మానంలో పెట్టాలని, బహిరంగంగా ప్రకటించాలని మూడో షరతు పెట్టారు. 102 మంది ఎమ్మెల్యేల నుంచి సిఎంను ఎంపిక చేయాలని, మీరు ఏది చెబితే అది కాంగ్రెస్ అధ్యక్షురాలికి పంపుతామని, కానీ తీర్మానంలో భాగం చేయాలని ఖర్గే, మాకెన్ అన్నారు. అలాంటిది ఎన్నడూ జరగలేదని, ఎందుకంటే ఒకసారి తీర్మానాన్ని ఆమోదించిన తరువాత దానిని కాంగ్రెస్ అధ్యక్షులకు వదివేయాలని అన్నారు. ఈ మూడు షరతుల ఆధారంగా తీర్మానం చేయాలనీ, ఈ షరతులు తీర్మానంలో భాగంగా కావాలని గెహ్లాట్ వర్గం పట్టుపట్టింది. అయితే అందుకు ఖర్గే, మాకెన్‌లు షరతులతో కూడిన తీర్మానాలు ఉండవని, ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని స్ఫష్టం చేశారు.
అధ్యక్ష బరిలో కొత్త ముఖాలు..!
కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ బరిలో ఉండకపోవచ్చని దాదాపు ఖరారైంది. సంధానకర్తగా ఉన్న అశోక్ గెహ్లాట్ నిర్ణయంపై గుర్రుగా ఉన్న గాంధీ కుటుంబం ఆయనకు మద్దతు ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. దీంతో అధ్యక్ష బరిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేల్లో ఒకరు బరిలో నిలబడే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత తనకు కూడా ఉందని దిగ్విజరు సింగ్ అన్నారు.