Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ అడవీని కూడా వదలటం లేదు
- భూమి, నీరు, అడవి కార్పొరేట్లకు ధారదత్తం
- భూమి అధికార్ ఆందోళన్ జాతీయ సదస్సులో హన్నన్ మొల్లా
న్యూఢిల్లీ : దేశంలో ఆదివాసులు భూమి హక్కు కోసం పోరాటం చేయాలని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా పిలుపు నిచ్చారు. రెండు రోజుల పాటు జరిగిగే భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) నాల్గో అలిండియా కన్వెన్షన్ సోమవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్ క్లబ్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశంలో వందల ఏళ్ల నుంచి భూమిపై హక్కు కోసం రైతులు, ఇతర సంఘాలు పోరాడుతున్నాయని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా 2013లో భూమి సేకరణ చట్టం తీసుకొచ్చారని అన్నారు. ఇందులో కొన్ని నిబంధనలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 'ఆ చట్టంలో వ్యవసాయ భూమిని ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు రైతుల నుంచి సేకరించేటప్పుడు, రైతుల అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పబడింది. అలాగే తప్పనిసరిగా మార్కెట్ ధర చెల్లించాలని పేర్కొన్నారు. సోషల్ ఇంపెక్ట్ స్టడీ నిర్వహించాలని చట్టంలో పొందు పరిచారు. దీంతో పాటు సంబంధిత ప్రాజెక్టు సకాలంలో ప్రారంభం కాకపోతే, ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు'' అని హన్నన్ మొల్లా వివరించారు. అయితే 2014లో ప్రభుత్వం మారిందని, మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. భూ సేకరణ చట్టంలో రైతులకు, హక్కుదారులకు వీలుగా ఉండే నిబంధనలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. 'ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యకలాపాలకు భూ సేకరణకు రైతుల, హక్కుదారుల అనుమతి అవసరం లేదు. సేకరించిన భూమికి మార్కెట్ ధర ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు సకాలంలో ప్రారంభించకపోతే భూమిని తిరిగి రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సోషల్ ఇంపెక్ట్ స్టడీని కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది' అని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ, ప్రజా సంఘాలు పోరాటం చేశాయనీ, అయితే వాటినన్నింటిని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చామని తెలిపారు. భూమి అధికార్ ఆందోళన్ పోరాటం ఫలితంగా మోడీ సర్కార్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల ఆస్తులైన సహజ వనరులు నీరు, భూమి, అడవీ (జల్, జంగల్, జమీన్)ని కార్పొరేట్లకు ధారదత్తం చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. దేశంలోని అడవీని కూడా వదలటం లేదనీ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిపారు. వాటిని పరిరక్షించేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలనీ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్‌పై పోరాటం కొనసాగించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, బీఏఏ నేతలు మేధా పాట్కర్, సునీలం, ఉల్కా మహాజన్, అశోక్ చౌదరి, ఎఐకెకెఎంఎస్ అధ్యక్షుడు సత్యవాన్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.