Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంసంపై నిషేధం విధించాలన్న జైన్ మత సంస్థలను ప్రశ్నించిన బాంబే హైకోర్టు
- ఇది తమ పరిధిలో లేదని వ్యాఖ్య
ముంబయి : మాంసం, దాని ఉత్పత్తులపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలపై నిషేధం, ఆంక్షలు విధించాలని జైన్ మత సంస్థలు కోరటంపై బాంబే హైకోర్టు స్పందించింది. ఇలాంటి చర్యలతో ఇతరు హక్కుల్లోకి చొరబడాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారని మూడు జైన్ మత చారిటబుల్ ట్రస్ట్లను, ఆ మత సాంప్రదాయాలను పాటిస్తున్న ముంబయి నగరవాసిని ప్రశ్నించింది. ఈ విషయం చట్టసభల పరిధిలోకి వస్తుందని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్త, న్యాయమూర్తి జస్టిస్ మాధవ్ జామ్దార్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నిషేధాలు విధిస్తూ తాము చట్టం లేదా నిబంధనలు చేయలేమని స్పష్టం చేసింది. మాంసం, మాంసం ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలని కోరుతూ మూడు జైన్ మత చారిటబుల్ ట్రస్టులు, ముంబయి నగరవాసి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి ప్రకటనలను తాము తమ కుటుంబాలు పిల్లలతో సహా బలవంతంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా జీవించే తమ హక్కును ఉల్లంఘించిందనీ, తమ పిల్లల మెదళ్లను పాడు చేసిందని వివరించారు. అయితే, దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ''రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన గురించి ఏమిటి? ఇతరుల హక్కులను ఆక్రమించుకోవాలని మీరు (పిటిషనర్లు) ఎందుకు కోరుకుంటున్నారు? మీరు మన రాజ్యాంగ ప్రవేశికను చదివారా? ఇది కొన్ని వాగ్దానాలను చేస్తుంది'' అని చీఫ్ జస్టిస్ తెలిపారు. పిటిషన్పై ఆదేశాలు జారీ చేసే అధికారం తమకు ఉండకపోవచ్చని ధర్మాసనం వివరించింది.