Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పెన్షన్ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలి
- జంతర్‌మంతర్‌లో డిఫెన్స్ ఉద్యోగుల ఆందోళన
- మోడీ సర్కార్ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరు : తపన్ సేన్
న్యూఢిల్లీ : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, కొత్త పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని రక్షణరంగ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆలిండియా డిఫెన్స్ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడ జంతర్‌మంతర్‌లో భారీ ఆందోళన జరిగింది. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడారు. మోడీ సర్కార్ దేశంలో అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రయివేటీకరిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగులకు నష్టం చేసే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ డిమాండ్లపై సీఐటీయూ ఆందోళన చేస్తున్నదని తెలిపారు. అన్ని రంగాల ఉద్యోగులను ఏకతాటిపైకి వచ్చి, మోడీ సర్కార్ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపు నిచ్చారు. ప్రైవేటీకరణ, కొత్త పెన్షన్ విధానంపై బ్యాంకు, బీమా, రైల్వే తదితర రంగాల ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయనీ, రక్షణ రంగం ఉద్యోగులు కూడా వారికి తోడయ్యారని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనకు సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐడీఈఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎన్ సథక్ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారికి ఎలాంటి ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనం లభించడం లేదని అన్నారు. కొత్త పింఛను పథకంతో జీతంలో సగాన్ని పింఛనుగా చెల్లించాలనే నిబంధన దారుణమన్నారు. అలాగే దానివల్ల పింఛన్‌గా వచ్చేది చాలా తక్కువని పేర్కొన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఇతర సంఘాలతో కలిసి ఆందోళన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి సి శ్రీకుమార్, హెచ్ఎంఎస్ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, ఆప్ ఎంపి సంజరు సింగ్ తదితరులు మాట్లాడారు.