Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హౌంశాఖ సమావేశం
- కొలిక్కిరాని విభజన అంశాలు
- పురోగతి లేకుండా ముగిసిన చర్చలు
- అన్ని సంస్థలు విభజన చేయాలి : ఏపీ
- 53 సంస్థలే : తెలంగాణ
- మిగిలిన సంస్థల విభజనపై అభ్యంతరాలేంటీ? :కేంద్రం
న్యూఢిల్లీ : రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్ని పంచాయితీ తేలలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనలు వారు వినిపించారు. వాటికే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. దీంతో ఎటువంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లవుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కొలిక్కి రాలేదు. దీంతో విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటుచేసింది. మంగళవారం నాడిక్కడ కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కార్యాలయం (నార్త్ బ్లాక్)లో కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా నేతృత్వంలో సమావేశం జరిగింది. 14 అంశాలపై జరిగిన ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఇందులో ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించనవి ఉన్నాయి. ఈ సమావేశంలో రైల్వే బోర్డు అధికారులు, ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజ్ గుల్జార్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికాల వలవన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనగా, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యుత్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్, ట్రాన్స్‌కో జెఎండి శ్రీనివాసరావు, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
షెడ్యూల్9లోని 91 సంస్థలు, కార్పొరేషన్ల ఉండగా, అందులో 90 సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు షీలాబేడీ కమిటీ చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం అంగీకరించగా, తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. 90 సంస్థలు, కార్పొరేషన్లకు గానూ 53కు తెలంగాణ అంగీకారం తెలిపింది. 22 సంస్థల విభజనకు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ సంస్థల విభజనపై ఉన్న అభ్యంతరాలు ఏమిటో తెలపాలని తెలంగాణను కేంద్రం కోరింది. దీనికి తెలంగాణ అధికారులు కొన్ని సంస్థలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏం చేయలేమని స్పష్టం చేసింది. న్యాయ శాఖతో సంప్రదించి అన్ని కోర్టు కేసులను పరిశీలించాలని హౌం శాఖ కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అయితే ఇందులో 15 సంస్థల విభజనకు తెలంగాణ అంగీకరించింది. కానీ వీటి విభజనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఏపీ అధికారులు షీలాబేడీ కమిటీ నివేదిక ఆధారంగా విభజన చేయాలని, అంతేతప్ప కొన్ని సంస్థలనే విభజన చేస్తామంటే తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. షీలాబేడీ కమిటీ ఇచ్చిన సంస్థల విభజన సిఫార్సులను తప్పని సరిగా అమలు చేయాలని ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అనేదానిపై న్యాయ సలహా తీసుకుంటామని హౌం కార్యదర్శి అజరు భల్లా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) స్టేటస్ కో అర్డర్ ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 2016 మేలోనే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డును పునర్నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే బోర్డు పునర్నిర్మాణం జరగలేదు. అప్పటి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను సిద్ధంచేసి, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిందని తెలంగాణ తెలిపింది. ఈ కేసులో కూడా రంగారెడ్డి జిల్లాలో 238 ఎకరాల భూమిని పున్ణప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిందనీ, అలాగే ఈ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది.
షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉండగా విభజనకు సంబంధించి ఉన్నాయి. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నగదు నిల్వలను జనాభా నిష్పత్తి, ప్రాంతాల ఆధారంగా ఆస్తుల విభజించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలకు బదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలని ఏపి ప్రభుత్వం కోరుతోంది. తెలుగు అకాడమీ విభజించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది కూడా పెండింగ్‌లోనే ఉంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్), ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్ఎంఈఎల్) విభజనకు సంబంధించి చర్చ జరిగింది. సింగరేణి కాలరీస్‌ను విభజించాలని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
కార్పొరేషన్ విభజనకు ముందు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వినియోగించిన నగదు రుణ బాధ్యతకు సంబంధించి వివాదం ఉంది. ఏపి స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ షరతులకు లోబడి నగదు క్రెడిట్ ప్రధాన మొత్తాన్ని చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన సబ్సిడీని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తామని హామీ ఇవ్వాలని తెలంగాణ కోరింది.
చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ లేవనెత్తగా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టానికి సవరణగా పరిగణించబడుతుందని పేర్కొంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తగా, నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను హౌం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఆదేశించారు.
తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేవనెత్తారు. అందుకు అవసరమైన భూమిని కూడా అందించామని తెలిపారు. హౌం సెక్రటరీ ఈ విషయాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను ఆదేశించారు.
ఏపీ వాదనలు
- షెడ్యూల్ 9లో అన్ని సంస్థలు విభజించాలి.
షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలకు ొబదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలి.
- చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజించాలి.
- ఏపీఎస్ఎఫ్సీ సంబంధించిన భూ వివాదాన్ని పక్కన పెట్టి, ఇతర సమస్యలు పరిష్కరించాలి.
- సింగరేణి కాలరీస్‌ను విభజించాలి.
- కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, ఈఎపి అప్పుల పరిష్కరించేం దుకు కాగ్ సహాయం తీసుకోవడానికి అంగీకారం.
- టిఎస్సిఎస్సిఎల్ (తెలంగాణ) నుంచి ఏపిఎస్‌సిఎస్‌సిఎల్ (ఏపి) క్యాస్ క్రెడిట్, 2014-15ను సంబంధించిన రైస్ సబ్సిడీ ఏపీకి విడుదల చేయాలి.
తెలంగాణ వాదనలు
- షెడ్యూల్9లో 53 సంస్థలు మాత్రమే విభజన చేయాలి.
- షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులను ప్రాంతాలు, జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలి.
- చట్టంలో ప్రస్తావించని 12 విద్యాసంస్థల విభజించడం అభ్యంతరం.
- ఎపిఎస్ఎఫ్సి భూమి తెలంగాణకే చెందుతుంది.
- సింగరేణి కాలరీస్‌ను విభజన ప్రశ్నే లేదు.
- కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, ఈఎపి అప్పుల పరిష్కరించేందుకు కాగ్ సహాయం తీసుకోవడానికి అంగీకారం.
- టీఎస్సీఎస్సీఎల్ (తెలంగాణ) నుంచి ఏపిఎస్‌సిఎస్‌సిఎల్ (ఏపీ) క్యాస్ క్రెడిట్ ఇచ్చేందుకు అంగీకారం. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అందిన వెంటనే బదిలీ.
- చట్టంలోని సెక్షన్ 50, 51, 56లో పేర్కొన్న పన్నుల విషయాల్లోని క్రమరాహిత్యాలకు సంబంధించిన అంశాలను తొలగించడానికి చట్టాన్ని సవరణకు అభ్యంతరం.