Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిధులపై ఆధారపడరాదంటూ మోడీ సర్కార్ ఆదేశాలు
- ఐఐటీ బాంబేలో 53శాతం ఫీజుల పెంపు
- 500శాతం పెరిగిన ఎం.టెక్ ట్యూషన్ ఫీజు
- ఫీజులు భరించలేక అడ్మిషన్లు తీసుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీలు
- గతేడాది 63శాతం తగ్గిన రిజర్వ్డ్ కేటగిరీ అడ్మిషన్లు..
- ఉన్నత విద్య ప్రయివేటీకరణే అసలు ఉద్దేశం : రాజకీయ విశ్లేషకులు
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అన్నిరకాల ఫీజులు భారీగా పెరిగాయి. ఐఐటీ, బాంబేలో ట్యూషన్ ఫీజు, పరీక్షల ఫీజు, హాస్టల్ రెంట్, మెస్, సెక్యూరిటీ డిపాజిట్లు..ఇలా అన్నీ పెంచేశారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థుల ఫీజుల్లోనూ పెంపుదల 53.21శాతంగా ఉంది. ఎం.టెక్ ట్యూషన్ ఫీజు 500శాతం పెరిగింది. ఇది ఐఐటీలకే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, అలహాబాద్, హైదరాబాద్..అన్ని నగరాల్లోనూ సెంట్రల్ వర్సిటీలు, విద్యా సంస్థల్లో ఫీజులు పెంచుకోవాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడటం తగ్గించుకోవాలని మోడీ సర్కార్ ఆదేశాలు పంపింది. ఇదంతా కూడా పేద, అణగారిన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఉన్నత విద్యారంగంలో మోడీ సర్కార్ చేపడుతున్న మార్పులు..అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఓ వైపు విద్యారంగాన్ని ప్రయివేటీకరిస్తూనే, మరోవైపు ప్రభుత్వరంగంలోని వర్సిటీల్లో ఫీజులు భారీగా పెంచుతూ వస్తోంది. ఈ ఫీజుల భారాన్ని తట్టుకోలేక అనేకమంది ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు అడ్మీషన్లు తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. దాంతో దేశవ్యాప్తంగా ఐఐటీలు, వర్సిటీల్లో ఫీజు పెంపును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉన్నత విద్యారంగంలో నిధుల వ్యయాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ...కొత్త పాలసీలను పాలకులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇదంతా కూడా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఐఐటీల్లో, ఢిల్లీ, ముంబయి, అలహాబాద్, హైదరాబాద్..మొదలైన నగరాల్లోని వర్సిటీల్లో వివిధ కోర్సుల ఫీజులు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఉన్నత విద్యారంగాన్ని 'వ్యాపారాత్మకం' చేయాలన్న వ్యూహంలో భాగంగానే పాలకులు గతకొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్సిటీల్లో ఫీజుల పెంపు వివాదానికి మూలం 2016లో కేంద్రం తీసుకొచ్చిన హెచ్ఈఎఫ్ఏ. దీనికి అప్పటి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 'హెచ్ఈఎఫ్ఏ' ఫండ్స్ వర్సిటీలో వసతుల కల్పనకు ఉపయోగపడతాయని బడ్జెట్ ప్రసంగంలో ఆనాటి కేంద్ర ఆర్థికమంత్రి దేశ ప్రజలకు తెలిపారు. దీంతో సెంట్రల్ వర్సిటీలు రుణాలు చేసి నిధులు సమకూర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. విద్యార్థులపై వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ..రుణాల ఈఎంఐలు చెల్లించాలని కేంద్రం వర్సిటీలకు దిశానిర్దేశం చేసింది.
ప్రతిఏటా రుణ వాయిదా చెల్లించాల్సిందే
హెచ్ఈఎఫ్ఏ తీసుకొచ్చాక ఈ పథకం కింద తొలుత రుణాలు అందుకున్న విద్యా సంస్థలు ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ. ఈ నిధులు అందాయో లేదో..ఐఐటీ బాంబే, ఢిల్లీలో ఫీజులు భారీగా పెంచేశాయి. ఫీజుల పెంపు వాస్తవమేనని ఐఐటీ బాంబే డైరెక్టర్ ధ్రువీకరించారు. ఉదాహరణకు ఐఐటీ బాంబే అంతర్గత నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కోర్సుల ఫీజులు భారీగా పెంచేసింది. హెచ్ఈఎఫ్ఏ కింద మంజూరైన రుణాలు దాదాపు రూ.42కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పదవ వంతు ప్రతి ఏటా ఆ విద్యా సంస్థ చెల్లించాల్సి వస్తోంది. వర్సిటీ అంతర్గత నిధుల సమీకరణ పెంచుకోవాలని అలహాబాద్ వర్సిటీకి కేంద్రం ఇటీవల ఆదేశాలు పంపింది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహకారంపై ఆధారపడటం తగ్గించుకోవాలని కచ్చితంగా తెలిపారని వర్సిటీ పబ్లిక్ రిలేషన్ అధికారి జయ కపూర్ తెలిపారు.
ఎన్ఈపీలో భాగంగానే..
నూతన జాతీయ విధానం (ఎన్ఈపీ)లో భాగంగానే 'హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ' (హెచ్ఈఎఫ్ఏ) పథకాన్ని మోడీ సర్కార్ తీసుకొచ్చిందని సమాచారం. ఉన్నత విద్యారంగాన్ని క్రమక్రమంగా ప్రయివేటీకరించాలన్నదే 'ఎన్ఈపీ'లోని ప్రధాన లక్ష్యం. దీనిపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, 2016లో హెచ్ఈఎఫ్ఏను కేంద్రం తెరపైకీ తీసుకొచ్చింది. ఈ రుణ పథకాన్ని అన్ని విద్యా సంస్థల్లో అమలు చేయాలని వివిధ రాష్ట్రాలకు ఆదేశాలు సైతం జారీచేసింది. గత ఐదేండ్లుగా తొలుత ఐఐటీలు, సెంట్రల్ వర్సిటీల్లో అమలుచేస్తోంది. కేంద్ర నిధులపై ఆధారపడరాదని, వర్సిటీలు స్వంతంగా నిధుల సమీకరణ పెంచుకోవాలని మోడీ సర్కార్ చెబుతోంది. గతకొన్నేండ్లుగా విద్యాసంస్థల్లో పెరిగిపోయిన ఫీజుల దెబ్బకు ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థుల అడ్మీషన్లు పడిపోతున్నాయి. ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అడ్మీషన్లు గణనీయంగా పడిపోయాయి. టాప్-7 ఐఐటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో గత ఐదేండ్లలో రిజర్వ్డ్ కేటగిరీ అడ్మీషన్లు 63శాతం తగ్గాయని పార్లమెంట్లో కేంద్రమే వెల్లడించింది. అడ్మీషన్లు పడిపోవటానికి ఫీజుల పెంపు ప్రధాన కారణమని విమర్శలున్నాయి.