Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాల మద్దతుతోనే దళితులపై దాడులు
- దళితులపై దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 5న జాతీయ కన్వెన్షన్
- దళిత హక్కుల పరిరక్షణ కోసం విస్తృత వేదిక : డీఎస్ఎంఎం నేత సుభాషిణి అలీ
న్యూఢిల్లీ : దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దళిత, గిరిజన వర్గాలపై దాడులు పెరిగాయని, దళిత మహిళలపై లైంగికదాడులు పెరిగాయని దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ నేత సుభాషిణి అలీ పేర్కొన్నారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 5న ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో డీఎస్ఎంఎం, ఎఐఎడబ్ల్యూయూ, ఎఐసీఆర్డీ, బీకేఎంయు, ఎఐఏఆర్ఎల్ఎ ఆధ్వర్యంలో జాతీయ కన్వెన్షన్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కన్వెన్షన్‌కు దళిత హక్కులపై పని చేసే సంఘాలు, వ్యక్తులను ఆహ్వానిస్తున్నామని, దళిత హక్కుల పరిరక్షణ కోసం విస్తృత వేదికను ఏర్పాటు చేస్తామని పేర్కన్నారు. మంగళవారం నాడిక్కడ క్యానింగ్ లైన్ 36లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయం (ఎఐఎడబ్ల్యూయూ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభాషిణి అలీ మాట్లాడారు. దేశంలో ప్రభుత్వాల మద్దతుతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయనీ, దళితులపై జరుగుతున్న దాడులకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దళిత, గిరిజనలపై జరుగుతున్న దాడులకు కేంద్రంలోని, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మనువాది బీజేపీ, సంఘపరివార్ బాధ్యత వహించాలని అన్నారు. గత ఎనిమిదేండ్లలో దళితులు, ఆదివాసీలపై నేరాలు బాగా పెరిగాయనీ, దీనికి కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలపై నియంత్రణలో ఉన్న బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ల బహిరంగ మనువాద స్వభావం కారణమని పేర్కొన్నారు. 2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, దేశవ్యాప్తంగా ఆందోళనలతో పార్లమెంట్ జోక్యం చేసుకొని దాన్ని రద్దు చేసిందని తెలిపారు. ఎందరో దళిత యువకులను కాల్చి చంపడం, వందలాది మంది నెలల తరబడి జైలు జీవితం గడపడం మర్చిపోలేమని పేర్కొన్నారు.
దళితులు హక్కులను కోల్పోతున్నారుః బి.వెంకట్
దళితుల హక్కులను కోల్పోతున్నారని ఎఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని ధిక్కరించి పాలన సాగిస్తోందని విమర్శించారు. లౌకిక వాదం స్థానంలో మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనీ, హిందూత్వాన్ని, మనుధర్మాన్ని ఓడించకుండా రాజ్యాంగాన్ని కాపాడుకోలేమని అన్నారు. దళితులను అవమానపరిచే, అంగవైకల్యానికి గురిచేసే, హత్య చేసే భయానక దాడులు తరచుగా జరుగుతున్నాయని, దళిత మహిళలు, యువతులపై భౌతిక,లైంగిక దాడులు, హత్యలు రోజువారీ వ్యవహారంగా మారాయని అన్నారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య కుల నిందితులను రక్షించడానికి తన అధికారాలన్నింటినీ ఉపయోగించిన విధానానికి హత్రాస్ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. కేసు నత్త నడకన సాగుతోందని, హత్యకు గురైన బాధితురాలి కుటుంబం భయాందోళనకు గురవుతున్నదని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఎక్కువ మంది దళితులకు విద్య, మంచి ఉపాధికి అవకాశం లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. ఈ కన్వెన్షన్ ఈ సమస్యలను చర్చించడమే కాకుండా దళితులను పరిరక్షణకు పోరాటాన్ని చేపట్టాలనుకునే వారందరిని కలుపుకొని విస్తృత వేదికను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అలాగే దేశ వ్యాప్త పోరాటాలకు కూడా పిలుపునిస్తుందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో విక్రమ్ సింగ్ (ఎఐఎడబ్ల్యూయూ), విఎస్ నిర్మల్ (ఎఐసీడీఆర్), ధిర్మేంద్ర ఝా (ఎఐఎఆర్ఎల్ఎ) పాల్గొన్నారు.