Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు నిరసన, కోవిడ్..ఖాతాల్ని బ్లాక్ చేశాం..
- కర్నాటక హైకోర్టుకు తెలిపిన ట్విట్టర్
న్యూఢిల్లీ : రైతు నిరసనలను అడ్డుకోవడానికి, కోవిడ్ సంక్షోభంపై వాస్తవాలు దాచేందుకు మోడీ సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చట్టాల్ని అతిక్రమించి, తెరవెనుక కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి కర్నాటక హైకోర్టులో ట్విట్టర్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల్ని నిరసిస్తూ సాగిన రైతు నిరసనలు, కోవిడ్ స్పందనకు సంబంధించి ట్విట్టర్ ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయాలని తమపై కేంద్రం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసిందని, అధికారిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయని ట్విట్టర్ ప్రతినిధి అరవింద్ దాతర్ కర్నాటక హైకోర్టుకు తెలియజేశారు. ''ఐటీ చట్టం సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్రం అడిగిన ఖాతాలన్నీ బ్లాక్ చేయటం కుదరదు. కేవలం సమాచారం మాత్రమే బ్లాక్ చేయడానికి ఆస్కారముంది. అది కూడా నిర్దేశిత ఖాతాలపైన్నే. కానీ మొత్తం ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది'' అని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఫలానా ఖాతాల్ని పూర్తిగా బ్లాక్ చేయాలని ఈఏడాది ఫిబ్రవరిలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ ట్విట్టర్ కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై వాదోపవాదనలు వింటున్న ధర్మాసనం ముందు హాజరైన ట్విట్టర్ ప్రతినిధి అరవింద్ దాతర్ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల వల్ల ట్విట్టర్ వాణిజ్యం ప్రభావితమైందని, ప్రముఖ వ్యక్తుల ఖాతాలు సైతం బ్లాక్ చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. ''ఢిల్లీ శివార్లలో రైతు నిరసనలపై ట్విట్టర్ ఖాతాలన్నీ రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది. సామాజిక మాధ్యమంలో వచ్చేది ఆపేస్తే..ఆగుతుందా? ఇంకోవైపు వార్తా పత్రికల్లో, టీవీ ఛానల్స్‌లో ఆగలేదు కదా!'' అని ధర్మాసనం ముందు ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఖాతాలను బ్లాక్ చేయటం అన్నదానిపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయాలని, ఆయా దేశాల్లో ఈ అంశంపై ఎలాంటి తీర్పులు వెలువడ్డాయో పరిశీలించాలని న్యాయమూర్తి జస్టిస్ దీక్షిత్ అన్నారు.