Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రం ఏ శాఖలో, విభాగంలో అవార్డులు ఇచ్చినా వాటిల్లో ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దేశవ్యాప్తంగా 20 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 తెలంగాణ నుంచే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే పాలించుకోలేరని, చీకట్లు కమ్ముకుంటాయని విమర్శలు చేశారన్నారు. కానీ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయి అద్భుత పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు. అక్షరాసత్య, అభివృద్ధిలో ఒకప్పుడు వెనుకపడిన ప్రాంతం ఇప్పుడే దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అన్ని రంగాల్లో అద్భుత పని తీరు కనపర్చుతున్న రాష్ట్రంపై కక్షసాధింపు చేస్తారా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా మెరుగైన అభివృద్ధి తెలంగాణలో సాగుతోందని, వివిధ శాఖలు, విభాగాలకు వస్తున్న అవార్డులే అందుకు నిదర్శనమని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణకు కనీస మద్దతు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హౌదా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.