Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళపై తప్పుడు ఆరోపణలను ఖండించిన పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : శాంతిభద్రతలకు, మత సామరస్యానికి ప్రతీకగా ఉంటున్న కేరళలో ఒకవైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ హింసను ప్రేరేపిస్తూ మరోవైపు తీవ్రవాదానికి కేరళ కేరాఫ్‌గా మారుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ వైఖరిని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. మతోన్మాద ఆర్ఎస్ఎస్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పరస్పర హత్యలు, ప్రతీకార హత్యలతోనే కేరళలో రాజకీయ హింస చోటు చేసుకుంటోందన్న వాస్తవాన్ని బీజేపీ ఆరోపణలు కప్పిపుచ్చలేవని పేర్కొంది. తీవ్రవాదానికి హాట్‌స్పాట్‌గా కేరళ మారుతోందంటూ బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా తప్పుబట్టింది. అలప్పుజ, పాలక్కాడ్ జిల్లాల్లో ఆర్ఎస్ఎస్, పీఎఫ్ఐ కార్యకర్తలు జరిపిన హత్యల కారణంగా ఈ ఏడాదిలోనే నలుగురు మరణించారని తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న మతపరమైన ప్రశాంతతను విచ్ఛిన్నం చేయడానికి, మతపరమైన చీలికలు తీసుకురావడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలే ఇవని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇటువంటి రెచ్చగొట్టే కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ నడ్డా ఆర్ఎస్ఎస్కు సలహా ఇస్తే బాగుంటుందని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. అన్ని తీవ్రవాద సంస్థల హింసాత్మక చర్యలు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. మత సామరస్యత, శాంతి పట్ల కేరళ ప్రజలకు అచంచలమైన నిబద్ధత వుందని, వారెలాంటి తీవ్రవాద హింసను సహించబోరని పొలిట్‌బ్యూరో పేర్కొంది.