Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల భూమిపై దాడి
- దేశంలో 80 ప్రాంతాల్లో భూమి లాక్కొంటున్నారు
- 18 డిమాండ్ల సాధనకు ఆందోళన
- భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామ సభ తీర్మానాలు
- బీఏఏ నేతలు
న్యూఢిల్లీ : భూ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేసేందుకు భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) పిలుపు ఇచ్చింది. 18 డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తామని స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు జరిగిన భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) నాలుగో ఆలిండియా కన్వెన్షన్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కాన్స్ట్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఏఏ నేతలు హన్నన్ మొల్లా, అశోక్ ధావలే, సునీలం, రోమా, మాధూరి, అశోక్, ఉల్కా మహాజన్, దయామని బర్లా, ప్రఫుల్ సంతాలా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల నుంచి 70 సంఘాలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలపై ప్రతినిధులు చర్చించారు. భూమి హక్కు కోసం బీఏఏ పని చేస్తోందనీ, గిరిజనుల భూమి దాడికి గురవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో బలవంతంగా భూ సేకరణ జరిగిందని గుర్తించినట్లు తెలిపారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. నేషనల్ లాండ్ మానిటైజేషన్ పైప్లైన్ తీసుకొచ్చి పేదల భూములను కార్పొరేట్లకు అప్పన్నంలా దోచిపెడుతున్నారని విమర్శించారు. అడవులను లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామ సభ తీర్మానాలు చేస్తామని, ఎస్కేఎం, ఎఐకేఎస్సీసీ తదితర సంఘాలతో కలిసి పోరాడుతామని తెలిపారు. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అటవీ పరిరక్షణ కోసం ఆందోళన చేస్తామని, జనవరి 30న మహత్మా గాంధీ వర్థంతి సందర్భంగా మనువాది , కార్పొరేట్ సర్కార్కు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్పొరేట్లకు భూమి అప్పగించడాన్ని ఆపాలని, రైతులకు భూమి హక్కులపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ పునరావాస, పరిహార చట్టం, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు, బయోడైవర్సిటీ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం, మత్య్స, డైరీ వంటి రంగాలను అనుసంధానం చేయాలని కోరారు. రూ.600 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ, రైతు, కార్మిక, ప్రజలకు సంబంధించిన 18 డిమాండ్లను సాధన కోసం పోరాటం చేస్తామని అన్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఈ డిమాండ్లను పెట్టాలని డిమాండ్ చేశారు.