Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ విద్యుత్ కంపెనీలకు అనుకూలంగా గెజెట్ విడుదల
నగరాల్లో గాలి కాలుష్యానికి ముఖ్య కారణం 'సల్ఫర్'. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచి సల్ఫర్ పెద్దమొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతోంది. దీనిని అరికట్టే పరిజ్ఞానం 'డీసల్ఫరైజేషన్' (ఎఫ్‌జీడీ) మన వద్ద ఉన్నా.. అనేక కంపెనీలు నియంత్రణా చర్యలు చేపట్టడం లేదు. బడా కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చిన ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గింది. ఎఫ్‌జీడీ డెడ్‌లైన్ గడువు డిసెంబర్ 2027కు మార్చుతూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. పాలకులు మరోవైపు 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. డెడ్‌లైన్ మార్పు వెనుక పాలకుల ఆర్థిక, రాజకీయ ప్రయోజనం దాగుందని నిపుణులు విమర్శిస్తున్నారు.
- కాలుష్య ఉద్గారాల 'డెడ్‌లైన్' డిసెంబర్ 2027కు మార్చుతూ నిర్ణయం
- సల్ఫర్ ఉద్గారాన్ని అడ్డుకునే చర్యలపై కేంద్రం రాజీ!
- కార్పొరేట్ లాబీ ఒత్తిడికి తలొగ్గింది..
- 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' లక్ష్యాన్ని చేరదు : పర్యావరణ నిపుణులు
న్యూఢిల్లీ : రోజంతా విపరీతమైన ఎండ..కొంతసేపటి తర్వాత భారీ వర్షం. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్ని ముంచెత్తుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల ఫలితమిది. నగరాల్లో గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు ఆధునిక మానవుడికి సవాల్‌గా మారాయి. దీనిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు కార్బన్, సల్ఫర్ ఉద్గారాల్ని అరికట్టే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో ముఖ్యమైంది విద్యుత్ ప్లాంట్ల వద్ద 'ఎఫ్‌జీడీ' అమలు. దీనిపై మనదేశంలో కేంద్రం పదే పదే గడువు పెంచటాన్ని పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఒకసారి 'డెడ్‌లైన్' పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మళ్లీ రెండోసారి డెడ్‌లైన్ గడువు మార్చుతూ (సెప్టెంబర్ 7న) ఆదేశాలు జారీకావటంపై పర్యావరణ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌జీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా విద్యుత్ తయారీ కంపెనీలు డిసెంబర్ 2027 వరకు ఏర్పాటు చేయనక్కర్లేకుండా వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు, పర్యావరణ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివిధ నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' లక్ష్యాల్ని తాజా నోటిఫికేషన్ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, హైదరాబాద్..సహా వివిధ నగరాల్లో నేడు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరాల్లో గాలి నాణ్యత పెంచేందుకు 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం'ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులోని లక్ష్యాల్ని 2025కల్లా చేరుకుంటామని మోడీ సర్కార్ ప్రకటించింది.
ససేమిరా అంటున్న ప్రయివేటు
మనదేశంలో సుమారుగా 600కు పైగా ప్రభుత్వ, ప్రయివేటు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్ల వద్ద కార్బన్, సల్ఫ్యూరస్ ఆక్సైడ్..తదితర కాలుష్యకారకాలు పెద్దమొత్తంలో వాతావరణంలోకి విడుదల వుతున్నాయి. ముఖ్యంగా సల్ఫ్యూరస్ ఆక్సైడ్ అత్యంత ప్రమాదకరమైంది. దీనిని అడ్డుకునేందుకు 'ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్' (ఎఫ్‌జీడీ) అనే సాంకేతిక పరిజ్ఞానముంది. దీనిని ప్లాంట్ల వద్ద ఏర్పాటుచేయడానికి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు నిరాకరిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో మనదేశం ముందున్న లక్ష్యాలు నెరవేరాలంటే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఎఫ్జీడీని కచ్చితంగా అమల్లోకి తేవాలి. అయితే ఇందుకు విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు ససేమిరా అంటున్నాయి. వాటి ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గుతూ కాలుష్య ఉద్గారాల డెడ్‌లైన్‌ను డిసెంబర్ 2027కు మార్చుతూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్థిక, రాజకీయ ప్రయోజనం కోసమే?
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు..దేశవ్యాప్తంగా అనేక బొగ్గు గనుల్ని ప్రయివేటుకు కేటాయిస్తూ వస్తోంది. కొత్తగా ప్రయివేటు విద్యుత్ తయారీ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు మంజూరుచేసింది. ఇవన్నీ ఎఫ్‌జీడీ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వీటి వెనుకున్న కార్పొరేట్ లాబీ తీసుకొచ్చిన ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గుతూ 'ఎఫ్‌జీడీ డెడ్‌లైన్'ను రెండోసారి మార్చింది. కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు శాఖ సెప్టెంబర్ 7న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
రాజీ పడితే...ప్రమాదం
పాలకులు దేశవిదేశాల్లో పలు వేదికలపై పెద్ద పెద్ద మాటలు చెప్పటం కాదు, కాలుష్య ఉద్గారాల్ని అడ్డుకునే చర్యలు కఠినంగా అమలుజేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు రాజీపడితే దేశ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో పడటం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులు, విపరీతమైన వేడిమి, మరోవైపు వెంటనే భారీ వర్షం..వంటివి ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి.
భారత్‌లో కోట్లాది మంది గాలి కాలుష్యం బారినపడుతున్నారు. చలికాలంలో ఢిల్లీలాంటి నగరాల్లో బయటకు రాలేని పరిస్థితి. గుండె, శ్వాసకోశ వ్యాధులకు సల్ఫ్యూరస్ ఆక్సైడ్, ఇతర సమ్మేళనాలు కారణమవుతున్నాయి. అంతేకాదు వాతావరణంలో నైట్రోజన్‌తో కలిసి సల్ఫర్ భూమిని చేరుతుంది. సారవంతమైన భూములను దెబ్బతీస్తుంది. తద్వారా హఠాత్తుగా పంట ఉత్పత్తి పడిపోయే ప్రమాదముంది.