Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత రేషన్ మరో మూడు నెలల పొడిగింపు
- మూడు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్‌కు డీఏ, డీఆర్ 4 శాతం పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడిక్కడ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించారు. ఈ ఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) 4శాతం అదనపు వాయిదాల విడుదలకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గం కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో ఖజానాకు ఏడాదికి రూ.6,591.36 కోట్లు, పెన్షనర్లకు డీఆర్ పెంపుతో ఏడాదికి రూ.6,261.20 అదనంగా భారం పడనున్నట్టు అంచనా. దీంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
మరో మూడు నెలలు ఉచిత రేషన్
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నాయోజన (పీఎంజీకేఏవై) ఉచిత రేషన్‌ను మరో మూడు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పొడించింది. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అమలవుతోందని కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపారు. నవరాత్రి, దసరా, మిలాద్ ఉన్ నబీ, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ దేవ్ జయంతి, క్రిస్మస్ పండగ సమయంలో పేదలు ఇబ్బందులకు గురికావద్దని ఈ పథకం పొడించినట్టు తెలిపారు. లబ్ధిదారులందరికీ ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు.
మూడు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు
న్యూఢిల్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ (సిఎస్ఎంటి) ముంబాయి, అహ్మదాబాద్ మూడు ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి (రీడవలప్మెంట్)కి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.10 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ అన్నారు. దేశవ్యాప్తంగా రూ.60 వేల కోట్లతో 199 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించిన పనులు చేసేందుకు గుర్తించామని, వీటిలో 47 రైల్వే స్టేషన్లకు టెండర్లు వేసినట్టు తెలిపారు.