Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం నియామకం
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత సైనిక అధికారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా రిటైర్ట్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తరువాత కేంద్రం ఈ నియామకం చేపట్టింది. 1981లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1981లో ఇండియన్ ఆర్మీలో 11 గూర్ఖా రైఫిల్స్‌లో మేజర్ జనరల్‌గా నియమితులయ్యారు. అనిల్ చౌహాన్ నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాములా సెక్టార్లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్‌గా ఆయన నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించారు. 2019 సెప్టెంబర్‌లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పదోన్నత అయ్యారు. 2021 మేలో ఈస్టర్న కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో విస్తృతమైన అనుభవం కలిగి ఉన్నారు. ఆయనకు విశిష్ట సేవకు పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకం లభించాయి. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత చైర్మెన్‌గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు. అలాగే ఆయన రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా కూడా ఉంటారు. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేసిన జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య 2021 డిసెంబరు 8న తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది కూడా చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, తరువాత తీవ్రంగా కాలిన గాయాలతో కన్నుమూసిన విషయం విదితమే.