Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల పాటు బ్యాన్ కొనసాగింపు
- గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- నిషేధం పరిష్కారం కాదు : ఏచూరీ
- ఆరెస్సెస్నూ బ్యాన్ చేయాలి : లాలూ
- కేంద్రం చర్యపై ఎస్డీపీఐ ఖండన
న్యూఢిల్లీ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్రం ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంఘాలు చట్ట విరుద్ధమైనవిగా పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరు పేజీల గెజిట్‌ను విడుదల చేసింది. పీఎఫ్ఐకి అనేక అసోసియేట్, అనుబంధ సంస్థలు, ఫ్రంట్లు రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐసీసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్ఓ), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నట్టు విచారణలో స్పష్టమైందని కేంద్రం పేర్కొన్నది.
'రాజకీయంగా ఒంటరిని చేయాలి'
పీఎఫ్ఐను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. నిషేధం పరిష్కారం కాదనీ, అలాంటి సంస్థలను రాజకీయంగా ఒంటరిని చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సూచించారు. బ్యాన్ మంచి నిర్ణయమనీ, ఆరెస్సెస్నూ బహిష్కరించాలని దేశంలోని మరికొందరు నాయకులు డిమాండ్ చేశారు. పీఎఫ్ఐకు చెందిన కార్యాలయాలు, నాయకుల ఇండ్లల్లో గత కొన్ని రోజుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరుపుతున్న విషయం తెలిసింది. పీఎఫ్ఐ రాజకీయ విభాగం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధించటం పరిష్కారం కాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. వాటిని రాజకీయంగా ఒంటరిని చేయాలని సూచించారు. కేరళ రాష్ట్రం ఉగ్రవాదానికి అడ్డాగా మారిందన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రతీకార హత్యలను ఆపాలని ఆరెస్సెస్‌కు చెప్పాలన్నారు. తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొనేలా రాష్ట్ర యంత్రాంగాన్ని అనుమతించాలని చెప్పారు. అలా చేసే అది పీఎఫ్ఐ అయినా లేదా మరే సంస్థ అయినా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని ఏచూరీ స్పష్టం చేశారు. భారత లౌకిక ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయటానికి మతం ఆధారంగా రెచ్చగొట్టే, ద్వేషాన్ని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే, బుల్డోజర్ వంటి రాజకీయాలు సమాధానం కాదని తెలిపారు. ఇది తీవ్రవాద సంస్థలు, కార్యకలాపాలు పెరిగే వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పారు. ఇలాంటి సంస్థలను రాజకీయంగా ఒంటరిగా చేసి అవి చేసే నేరపూరిత, అక్రమ కార్యకలాపాలపై పాలనాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏచూరీ పరిష్కారాన్ని సూచించారు. ''ఈ సమస్యను పరిష్కరించటానికి నిషేధం సమాధానం కాదు. మనం గత అనుభవాలను చూశాం. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ మూడు సార్లు నిషేధానికి గురైంది. ఏదైనా ఆగిందా? విద్వేషం, ఉగ్రవాదం, మైనారిటీ వ్యతిరేకత, మైనారిటీల ఊచకోత వంటివి కొనసాగాయి'' అని ఏచూరీ తెలిపారు. పీఎఫ్ఐ బ్యాన్ విషయాన్ని కేరళ సీపీఐ(ఎం) నాయకులు వ్యతిరేకించటంలేదన్నారు. వారు ఆరెస్సెస్నూ నిషేధించాలంటున్నారని చెప్పారు.హిందూ అతివాద సంస్థ అయిన ఆరెస్సెస్‌ను బ్యాన్ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇటు పీఎఫ్ఐపై నిషేధాన్ని కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్ మిత్ర పక్షం ఐయూఎంఎల్ స్వాగతించింది. ఆరెస్సెస్నూ ఇదే విధంగా బ్యాన్ చేయాలని తెలిపింది. విద్వేషాన్ని, మతోన్మాదాన్ని, హింసను వ్యాప్తి చేయటానికి సమాజాని రెచ్చగొట్టే అన్ని సిద్ధాంతాలు, సంస్థలకు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ తెలిపింది. తాను పీఎఫ్ఐను ఎల్లప్పుడూ వ్యతిరేకించాననీ, ప్రజాస్వామ్య విధానాన్ని సమర్థిస్తూ వచ్చానని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివరించారు. కోర్టుల ద్వారా న్యాయం కోసం ముస్లింలు పోరాడుతున్న తరుణంలో ఈ సంస్థపై నిషేధాన్ని సమర్ధించలేమని వరుస ట్వీట్లు చేశారు.