Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లితో సంబంధం లేదు
- వైవాహిక లైంగికదాడి కూడా రేప్ వంటిదే
- అప్పుడు కూడా గర్భవిచ్ఛితి చేయించుకోవచ్చు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : ఇష్టంలేని గర్భాన్ని సురక్షిత పద్దతులలో తొలగించు కునే హక్కు మహిళలందరికి ఉందని అత్యున్న త న్యాయస్థానం తేల్చిచెప్పింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (ఎంటిపి)కి సంబంధించి ఓ కేసు విచారణలో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి.పార్దివాలా, జస్టిస్ ఎఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలూ ప్రాధాన్యతనంతరించుకున్నాయి.
అబార్షన్లు చేయించుకోవడానికి పెళ్ళితో సంబంధం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం ఈ విషయంలో వివాహితులు, అవివావాహితులు అంటూ తేడా చూపడం రాజ్యాంగవిరుద్దమని పేర్కొంది. పెళ్ళైన తరువాత కూడా భార్య సమ్మితి లేకుండా భర్త వ్యవహరిస్తే అత్యాచారంగానే భావించాలని, ఆ సమయంలో ఆమె గర్భం దాల్చితే దానిని తొలగించుకోవచ్చని తెలిపింది. పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో అబార్షన్లపైనా, వైవాహిక అత్యాచారాలపైనా దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైవాహిక అత్యాచారాలపై కొన్ని దిగువ కోర్టులు భిన్నంగా స్పందిస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సురక్షిత గర్భ విచ్ఛిత్తి కూడా హక్కే!
అబార్షన్‌ను సురక్షిత పద్దతులలో చేయించుకోవడం కూడా మహిళల హక్కేనని ధర్మాసనం ఈ తీర్పులో స్పష్టం చేసింది. 'చట్ట ప్రకారం మహిళలందరికి సురక్షితంగా గర్భవిఛిత్తి చేయించుకునే హక్కు ఉంది. దానిని తిరస్కరించలేం.' అని పేర్కొంది. 'వైవాహిక స్థితి కారణంగా అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి వీలు లేదని అనలేం. ఎంటిపి నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా ఇష్టంలేకపోతే గర్భందాల్చిన 24 వారాల్లోగా తొలగించుకోవచ్చు. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అంటూ వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్దం. అలా చేస్తే నేరంగా భావించాలి. ఇష్టంలేని గర్భాన్ని తొలగించుకోవడానికి వివాహితులకు 24 వారాలు గడువిస్తూ, అవివాహితులకు అనుమతించకపోవడం సరికాదు' అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎంటిపి చట్టంలో వైవాహిక అత్యాచారాలు
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్టంలో వైవాహిక అత్యాచారాలను కూడా చేర్చాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 'అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే ప్రక్రియ. పెళ్లయిన తరువాత చట్టపరమైన భాగస్వామి (భర్త) నుండి కూడా ఈ తరహా లైంగిక వేధింపులు ఎదురుకావచ్చు. భర్త బలవంతం కారణంగా లొంగిపోక తప్పని స్థితి ఏర్పడవచ్చు. గర్భం దాల్చవచ్చు. ఇటువంటి సంఘటనలను కూడా అత్యాచారాలుగానే భావించాలి.' అని సుప్రీంకోర్టు వివరించింది. ' వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇటువంటి గర్భధారణల నుండి మహిళలను కాపాడాలి. ఎంటిపి చట్టంలో అత్యాచారానికి ఇచ్చిన అర్ధంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాలి.' అని ఆదేశించింది. ప్రస్తుతం ఎంటిపి చట్టం ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగా అభివృద్ధి చెందని ఘటనల్లో 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఇష్టంలేని గర్భాన్ని తొలగించుకునే హక్కు ఎటువంటి మినహాయింపులు లేకుండా మహిళలందరికి లభించింది.
చట్టం స్థిరంగా ఉండదు...!
అవివాహితులకు కూడా అబార్షన్ హక్కు ఉందని చెప్పిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఎప్పుడూ ఒకేలా ఉండదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. వివాహితులను అబార్షన్‌కు అనుమతిచ్చి, పెళ్లికాని వారికి ఆ అవకాశం లేదనం సబబుకాదు.' అని ధర్మాసనం వివరించింది.
ఇదీ నేపథ్యం...
25 ఏళ్ల అవివాహిత మహిళ ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలకతీర్పును వెలువరించింది. అవివాహితనైనందున చట్టప్రకారం అబార్షన్‌కు అర్హత లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేసింది. తాను గర్భం దాల్చి 23 వారాలైందని, తన భాగస్వామి పెళ్లికి నిరాకరించాడని ఆమె పిటిషన్లో పేర్కొంది. తన తల్లిదండ్రులు రైతులని, ఇంటికి తానే పెద్ద కుమార్తెనని, తనకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారని, ఇలాంటి సమయంలో బిడ్డను పోషించే స్థోమత తనకు లేదని పేర్కొంది. జులై 21న, గర్భంలోని పిండం ఆమెకు హానికలిగించదని మెడికల్ బోర్డు నిర్ధారించడంతో కోర్టు ఆ మహిళకు అబార్షన్‌కు అనుమతించింది. 2021లో సవరించిన అబార్షన్ చట్టంలోని నిబంధనలలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదాన్ని చేర్చారు.