Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ప్రోత్సాహకాలకు వాగ్దానం
- కేరళ పారిశ్రామిక విధానం కొత్త ముసాయిదా
- పెట్టుబడులను ఆకర్షించటం,ఉపాధి కల్పన లక్ష్యం
తిరువనంతపురం : పారిశ్రామిక రంగంలో మరిన్ని కొత్త మార్పులకు కేరళ సర్కారు సిద్ధమవుతున్నది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్ ఎంఎస్ఎంఈలకు భారీ ప్రోత్సాహకాలకు హామీనిచ్చే కొత్త ముసాయిదాను కేరళ సర్కారు తీసుకొచ్చింది. పెట్టుబడులను ఆకర్షించటం, ఉపాధి కల్పనను ప్రోత్సహించటం, వ్యవస్థాపకతను పెంపొందించటం లక్ష్యంగా అనేక ప్రోత్సాహకాలను ముసాయిదాలో పొందుపర్చింది. పెట్టుబడి రాయితీ, వంద శాతం విద్యుత్ మరియు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, ఖర్చుల రీయింబర్స్మెంట్ వంటి ప్రధాన ప్రోత్సాహకాలూ ఇందులో ప్రతిపాదించబడ్డాయి. నాలుగేండ్ల తర్వాత వస్తున్న కొత్త విధానం రాష్ట్రంలోని సాంప్రదాయ రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైటెక్ వ్యవసాయం, విలువ జోడించిన రబ్బరు ఉత్పత్తులు, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ, గ్రాఫేన్, ఎలక్రిక్ వాహనాలు, రోబోటిక్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తుంది.
ప్రతిపాదించిన ప్రధాన ప్రోత్సాహకాలు.. నాన్ ఎంఎస్ఎంఈలకు స్థిర మూలధనంపై పెట్టుబడి 10 శాతం పెట్టుబడి రాయితీ, అంటే గరిష్టంగా రూ. 10 కోట్లకు లోబడి, నాన్ ఎంఎస్ఎంఈ వారికి ఐదేండ్ల పాటు మూలధన పెట్టుబడి కోసం వంద శాతం రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను కలిగి ఉంటాయి. ఏటా, ప్రభుత్వం వెయ్యి మంది అప్రెంటిస్‌లకు స్టైఫండ్‌లో 50 శాతం సబ్సిడీని అదిస్తుంది. ఆరె నెలల పాటు ఒక్కో అప్రెంటిస్‌కు గరిష్టంగా రూ. 5000 వర్తిస్తుంది. అలాగే, ఎంఎస్ఎంఈలకు ఐదేండ్ల పాటు వంద శాతం విద్యుత్ సుంకం మినహాయింపు ఉంటుంది. పారిశ్రామిక పార్కుల్లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వందశాతం మాఫీ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మినహాయింపులుంటాయి. వాణిజ్య కార్యకలాపాఉల ప్రారంభించిన తేదీ నుంచి మూడేండ్ల కాలానికి ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి ప్రాధాన్యతా రంగ యూనిట్ల ద్వారా స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై ప్రభుత్వం రెండు శాతం వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది.
పాలసీ పీరియడ్‌లో ఏడాదికి పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 30 వేల మందికి పరోక్ష ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజల సంప్రదింపులు, క్యాబినెట్ పరిశీలన తర్వాత ఖరారు చేసిన పారిశ్రామిక విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తారని భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ, కరోనా మహమ్మారితో మోడీ సర్కారు విధించిన అనాలోచిత లాక్డౌన్ వంటి పరిస్థితులు పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయని నిపుణులు చెప్పారు. ఈ పారిశ్రామిక విధానం అమల్లోకి వస్తే ఊరట లభించి, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.