Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య మంథన్ 2022 పురస్కారం
- రూ.1636 కోట్లతో 43.4 లక్షల మందికి ఉచిత వైద్యం
- దేశం యావత్తు చేసిన ఖర్చులో 15శాతమిది...
- 148 ప్రభుత్వ హాస్పిటల్స్‌కు ఎన్‌క్యూఏఎస్ అక్రిడేషన్ హోదా
న్యూఢిల్లీ : ప్రజా ఆరోగ్య విషయంలో కేరళ మోడల్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. అత్యధిక మందికి ఉచిత వైద్య చికిత్స అందించిన రాష్ట్రాల్లో కేరళ నెంబర్‌వన్‌గా నిలిచింది. కేంద్రం నుంచి 'ఆరోగ్యమంథన్ 2022' పురస్కారాన్ని అందుకుంది. 'బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్'లో కేరళ మరో పురస్కారాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయానికి కోతలు పెడుతుండగా, ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్ మాత్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 43.4 లక్షల మంది లబ్దిదారులకు ఉచిత వైద్య చికిత్స అందించటం కోసం కేరళ ప్రభుత్వం రూ.1636 కోట్లను ఖర్చుచేసింది. ఇది దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలన్నీ చేసిన వ్యయంలో 15శాతానికి సమానం.
'జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల' (ఎన్‌క్యూఏఎస్) అక్రిడేషన్ కేరళలోని కొత్తగా 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌కు దక్కింది. దీంతో రాష్ట్రంలో ఎన్‌క్యూఏఎస్ అక్రిడేషన్ స్థాయి అందుకున్న ప్రభుత్వ హాస్పిటల్స్ సంఖ్య 148కు చేరుకుంది. ప్రజలే ప్రధాన కేంద్రంగా ఈ హాస్పిటల్స్ నడుస్తున్నాయని కేంద్రం ప్రశంసించింది.రాష్ట్రానికి పురస్కారం దక్కటంపై కేరళ సీఎం పినరరు విజయన్ స్పందిస్తూ..''ఆరోగ్యమంథన్ 2022 అవార్డు గెలుచుకోవటంతో కేరళ ప్రజా ఆరోగ్యం మరో మెట్టు ఎక్కింది. కారుణ్య ఆరోగ్య సురక్షా పద్ధతి పథకం ద్వారా 43.4 లక్షల మంది లబ్దిదారులకు ఉచిత వైద్య చికిత్స అందింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1636 కోట్లు ఖర్చుచేసింది'' అని చెప్పారు. కొట్టాయం, కొజికోడ్‌లోని మెడికల్ కాలేజీలు గరిష్టంగా ఉచిత చికిత్సలు అందిస్తున్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. కారుణ్య ఆరోగ్య సురక్షా పద్ధతి ద్వారా ప్రతి గంటకు 180 మంది రోగులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.ప్రజా ఆరోగ్యం రంగం నుంచి మోడీ సర్కార్ మెల్ల మెల్లగా తప్పుకుంటోంది. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమంటూ వైదొలగడానికి ప్రయత్నిస్తోంది. అయితే కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ సేవలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేలా అక్కడి వసతులను మెరుగుపర్చింది. శక్తివంతమైన, వికేంద్రీకృత ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కేరళ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. నిఫా వైరస్, కోవిడ్-19ను నియంత్రించటంలో అంతర్జాతీయ గుర్తింపు సైతం సాధించింది.