Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్గే, థరూర్, త్రిపాఠిలు దాఖలు
- కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి మల్లికార్జున ఖర్గే
- జీ 23 నేతలు ఖర్గేకే మద్దతు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే కెఎన్ త్రిపాఠి నామినేషన్ల దాఖలు చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం జరిగింది. సీనియర్ నేతలతో కలిసి మల్లికర్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ చైర్మెన్ మధుసూదన్ మిస్త్రీకి 14 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ హుడా, దిగ్విజరు సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే తన ప్రత్యర్థి శశిథరూర్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
జీ 23 నేతల మద్దతు ఖర్గేకే దక్కింది. ఖర్గే నామినేషన్ పత్రాలపై ఎకె అంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, అభిషేక్ సింఘ్వీ, అజరు మాకెన్, దిగ్విజరు సింగ్, తారిక్ అన్వర్, సల్మన్ ఖుర్షీద్, నారాయణ స్వామి, రాజీవ్ శుక్లాతో పాటు జీ 20 సభ్యులు ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చౌహాన్, భూపిందర్ హుడా, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి వారు సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఖర్గేకే ఉన్నట్టు సమాచారం. అందుకనే ఖర్గే నామినేషన్ ప్రతాలపై సీనియర్ నేతలు సంతకాలు చేశారనీ, ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీనియర్ నేతలు హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.
వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ నామినేషన్ దాఖలు చేస్తారని నిర్ణయం జరిగింది. అందుకు అనుగుణంగా ఆయన నామినేషన్ల పత్రాలు కూడా తీసుకున్నారు. అయితే గురువారం చివరి నిమిషంలో అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం మార్చింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపాలని నిర్ణయం చేసింది. సోనియా గాంధీతో సమావేశం అయిన అనంతరం ఆ పార్టీ సంస్థాగత కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఖర్గేను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. మిమ్మల్ని అధ్యక్షునిగా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరుకుంటుందని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు ఖర్గే నామినేషన్ దాఖలకు ఏర్పాట్లుచేశారు. మరోవైపు నామినేషన్ దాఖలు చేస్తానని గురువారం ప్రకటించిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్, అధిష్టానం ఆదేశాలు మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. తాను ఖర్గేకి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. దళిత వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ అధ్యక్షుడు చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.
శశిథరూర్ నామినేషన్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, కేరళ ఎంపి శశి థరూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. 50 మంది సంతకాలతో ఐదు సెట్ల నామినేషన్ పత్రాలు ఆయన దాఖలు అందజేశారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మూల స్తంభంగా గాంధీ కుటుంబం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఆ కుటుంబమే తమ పార్టీకి నైతిక బలమని, అంతిమ మార్గదర్శక స్ఫూర్తి అని తెలిపారు. 'కాంగ్రెస్‌పై నాకు ఓ విజన్ ఉంది. దానిని నేను అందరు ప్రతినిధులకు పంపుతాను. వారి మద్దతును కోరబోతున్నాను. పార్టీ కార్యకర్తలందరి గొంతుకగా నేను ఇక్కడ ఉన్నాను' అని అన్నారు. 'కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పంజాబ్ నుంచి నాగాలాండ్ వరకు పార్టీ సహచరులు సంతకాలు చేశారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాం. నా ప్రచారం వారిని ఆకర్షిస్తుంది. పార్టీని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తుందని నేను ఆశిస్తున్నాను' అన్నారు. అలాగే జార్ఖండ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కెఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
నేడు నామినేషన్ల పరిశీలన : మధుసుధన్ మిస్త్రీ
తమకు మొత్తం 20 నామినేషన్ పత్రాలు వచ్చాయనీ, అందులో 14 మల్లికార్జున్ ఖర్గేవేనని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ శుక్రవారం తెలిపారు. ఐదింటిని శశి థరూర్ దాఖలు చేయగా, ఒకటి జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కెఎన్ త్రిపాఠి దాఖలు చేశారని ఆయన అన్నారు. 'నేడు (శనివారం) నామినేషన్ల పత్రాలు పరిశీలిస్తాం. చెల్లుబాటు అయ్యే వాటిని, అభ్యర్థుల పేర్లను సాయంత్రం ప్రకటిస్తాం'' అని మిస్త్రీ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8న వరకు గడువు ఉంది. పోలింగ్ అక్టోబర్ 17న జరగనుంది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.