Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి బిఎల్ సంతోష్ రాక
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న సమయంలో ఆ పార్టీ ప్రధానకార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్ శుక్రవారం డెహ్రాడూన్‌కు చేరుకోవడం విశేషంగా మారింది. ధామి ప్రభుత్వాన్ని రిక్యూట్మెంట్ స్కామ్ వెంటాడుతుండగా, రాష్ట్రంలో ప్రముఖ బీజేపీ నాయకులు వినోద్ ఆర్యా కుమారుడు పుల్కిత్ ఆర్యా ఒక హత్య కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తమ రిసార్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి అంకిత భండారీ హత్య కేసులో పుల్కిత్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ముఖ్యమంత్రి ధామితో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో అనేక సార్లు ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొట్టారు. అక్కడి నేతలతో సమావేశాల్లో పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో సంతోష్ రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొనడం కోసం ఉత్తరాఖండ్‌కు సంతోష్ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రిక్యూట్మెంట్ స్కామ్‌లో రెండు స్థాయిల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అక్రమ నియామాకాలు జరిగినట్లు అలాగే, అసెంబ్లీకి చేసిన నియామకాల్లో పెద్ద ఎత్తున బంధుప్రీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరపాలనే డిమాండ్ కూడా ఉంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం వెల్లడైన హరిద్వార్‌లోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీని కలవరానికి గురి చేస్తున్నాయి. 44 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీకి 13 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ఈ అన్నింటి అంశాలపైనా బిఎల్ సంతోష్ సమీక్ష జరుపుతారని వార్తలు వస్తున్నాయి.