Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ప్రధాని
గాంధీనగర్: ప్రధాని మోడీ గాంధీ నగర్ నుంచి ముంబయికి ప్రయాణించే సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజులుగా ప్రధాని గుజరాత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్లో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కొంతసేపు ఆ రైలులో ప్రయాణించారు.
దేశంలో ఇది మూడవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కావడం గమనార్హం. 2019లో తొలి వందే భారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ - వారణాసి మార్గంలో ఈ సేవలను ప్రారంభించగా.. న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.
గాంధీనగర్ నుండి ముంబయి మధ్య నడిచే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కమర్షియల్ సేవలు అక్టోబరు 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు ప్రయాణించనుంది. ముంబయి నుండి ఉదయం 6.10 కు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12.30 కల్లా గాంధీనగర్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు 16 కోచ్‌లతో 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉందని, సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టేషన్లలో ఆగుతుందని అన్నారు.