Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29వేల పీఎంఎఫ్బివై దరఖాస్తులను తిరస్కరణ
చండీగఢ్ : హర్యానాలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బివై) పథకం కింద పంట బీమా కోసం పంపిన 29వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీరంతా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాకు చెందిన రైతులు. వీరి దరఖాస్తులను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అధికారులు వెనక్కు పంపారు. జాతీయ మీడియా సంస్థల్లో వచ్చిన నివేదిక ప్రకారం.. పత్తి, సజ్జ, గోరుచిక్కుళ్ల ఖరీఫ్ పంటల బీమా కోసం సుమారు 41 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి చివరి తేది ఆగస్ట్ 31. కామన్ సర్వీస్ సెంటర్ సేవలను వినియోగించుకుని రైతులు పత్రాలను అప్లోడ్ చేసినట్లు వ్యవసాయ కార్యకర్త అనిల్ కుమార్ తెలిపారు. అయితే ఆసమయంలో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదని అన్నారు. అయితే సెప్టెంబర్ 22న ఆ సంస్థ అధిక సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించింది. ఇవన్నీ కూడా ఇటీవల జిల్లాలో వర్షాల కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొన్న పత్తి పంటకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రాంతం సరిపోలలేదంటూ, భూమి రికార్డులు లేవంటూ, విత్తనాల ధృవీకరణ పత్రాలు లేవంటూ, కౌలుదారు ఒప్పందం లేదంటూ ఇలా పలు కారణాలతో వాటిని తిరస్కరించింది. వ్యవసాయ విభాగం జిల్లాలో జరిపిన సర్వేలో .. భారీ వర్షాల కారణంగా సుమారు 39వేల ఎకరాల్లో వేసిన పత్తి పంటలో 50 శాతం దెబ్బతిందని పేర్కొంది. అలాగే 5,784 హెక్టార్లలో 76 శాతం వేసిన గోరుచి క్కుళ్ల పంట దెబ్బతింది. 18,970 హెక్టార్లలో ఈ పంటను సాగుచేశారు. 1900 హెక్టార్లలో వేసిన సజ్జ పంటలో 800 హెక్టార్లకు చెందిన 76 శాతం దెబ్బతిందని తెలిపింది. దీంతో తమ పంటలకు బీమా వస్తుందని రైతులు ఆశించడం సర్వసాధారణం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సమగ్ర పంట బీమాను అందించేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్), పీఎంఎఫ్‌బీవైని ప్రవేశపెట్టింది. రైతులు పంట రుణాలు తీసుకునే ముందే పీఎంఎఫ్‌బీవై కింద బీమాను పొందే అవకాశం ఉంది. అయితే గత ఐదేండ్లలో బీమా పొందడంలో పలు అడ్డంకులు ఎదురవడంతో పథకం కవరేజీ తగ్గింది. ఉదాహరణకు, ఐదేండ్లలో ఖరీఫ్‌లో 29 శాతం, రబీలో 33 శాతం కవర్ చేయాల్సిన రైతుల సంఖ్య తగ్గింది. బీమా కంపెనీలు రూ. 92,954 కోట్ల బీమా క్లెయిమ్‌లకు గాను కేవలం రూ.87,320 కోట్లు మాత్రమే చెల్లించాయి. సుమారు 90 శాతం సీపీఎస్ఈ బీమా కంపెనీలు చాలా చెల్లింపులు చేస్తున్నాయి. కానీ ,ప్రయివేట్ బీమా కంపెనీలు చెల్లింపులు చేయడం లేదు. ఫలితంగా ఈ పథకం ద్వారా ప్రయివేట్ కంపెనీలు 60 శాతం నుంచి 70 శాతం లాభం పొందుతుండటం గమనార్హం.