Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ చమురును విక్రయిస్తోందంటూ ఆరోపణలు
న్యూఢిల్లీ : ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే పెట్రో కెమికల్ కంపెనీతో సహా పలు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. భారతీయ కంపెనీపై అమెరికా ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రధమం. పైగా విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికా పర్యటన ముగిసిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. ముంబయికి చెందిన త్రిబలాజి కంపెనీ ఇరాన్ చమురును కొనుగోలు చేసి ఆ తర్వాత చైనాకు పంపిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్‌తో కుదిరిన సమగ్ర కార్యాచరణ ఒప్పందం నుండి బయటకు వస్తూ 2018-19లో ఆనాటి ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఏకపక్ష ఆంక్షలను ఎదుర్కొంటున్న మొదటి భారతీయ సంస్థ ఇదే. అమెరికా ఏకపక్ష ఆంక్షలను అధికారికంగా ధృవీకరించడానికి భారత్ తిరస్కరించినా అనధికారికంగా ఇరాన్ నుండి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు మోడీ ప్రభుత్వం 2019లో అంగీకరించింది. భారత్ దిగుమతుల్లో ఇరాన్ నుండి వచ్చేవి దాదాపు 11శాతంగా వుంటాయి. లక్షలాది డాలర్ల విలువ చేసే ఇరాన్ పెట్రో కెమికల్ ఉత్పత్తులను దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు విక్రయించే క్రమంలో అంతర్జాతీయ కంపెనీల నెట్వర్క్ పనిచేస్తోందంటూ అమెరికా ఆర్థిక విభాగం ఆంక్షలు విధించింది. ఇరాన్ నుండి చమురు వస్తోందన్న సంగతిని దాచిపెట్టి మరీ ఈ కంపెనీలు తమ ఎగుమతులను నిర్వహిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీలతో కలిసి భారత కంపెనీ పనిచేస్తోందని తెలిపింది. దీనిపై విదేశాంగ శాఖ లేదా త్రిబాలాజి పెట్రో కెమికల్స్ కంపెనీ స్పందించలేదు.