Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా 2015 నుంచి 2022 వరకు
- ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర హౌం మంత్రిగా బాధ్యతలు
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, సీపీఐ(ఎం) కేరళ మాజీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ (69) కన్నుమూశారు. సీపీఐ(ఎం)తో పాటు పలు పార్టీలు, నాయకులు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 29న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాలుగైదు రోజుల మందు కాస్తా కోలుకున్నారని వార్తాలు వచ్చాయి. అయితే శనివారం రాత్రి 8 గంటలకు మరణించారు. ఆయన మరణవార్తా సీపీఐ(ఎం), వామపక్ష శ్రేణుల్లో విషాదం నింపింది. కొడియేరి మరణానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో, సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఆయనకు నివాళుర్పించింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం తెలిపారు. తన చిరకాల సహచరుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు దృఢమైన కమ్యూనిస్టు, ప్రజల కోసం శ్రమించే ధీటైన పోరాట యోథుడు కొడియేరి అని పేర్కొన్నారు. దోపిడి లేని భారత సమాజం కోసం, సామాజిక పరివర్తన కోసం అవిశ్రాంతంగా కృషి చేశారనీ ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సంతాపం తెలిపారు. చెన్నైలో ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ''నా ప్రియమైన సహచరుడు, మిత్రుడు కొడియేరి మరణం నన్ను కలచివేసింది. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాంతం అంకితం చేసిన చతురత కలిగిన నాయకుడు. పోరాటాలలో ఆయన మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. రెడ్ సెల్యూట్, కామ్రేడ్..'' అని సంతాపం తెలిపారు. కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్‌తో పాటు వివిధ పార్టీల నేతలు, రాష్ట్ర మంత్రులు, మళయాళీ సీని ప్రముఖులు, జర్నలిస్టులు, సామాజిక వేత్తలు, విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల నేతలు తదితరులు సంతాపం తెలిపారు.
కొడియేరి జీవిత నేపథ్యం
బాలకృష్ణన్ 1953 నవంబర్ 16న కేరళలోని కన్నూర్ జిల్లాలో తలస్సేరిలో కొడియేరి గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు కుంజున్ని కురుప్, నారాయణమ్మ దంపతులకు జన్మించారు. 1980లో కొడియేరి మాజీ ఎమ్మెల్యే ఎంవి రాజగోపాలన్ మాస్టర్ కుమార్తె ఎస్.ఆర్ వినోదినిని వివాహం చేసుకున్నారు. ఆయనకు బినోరు కొడియేరి, బినీష్ కొడియేరి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడియేరి జూనియర్ బేసిక్ స్కూల్, ఒనియన్ హైస్కూల్లో చదివారు. మహేలోని మహాత్మా గాంధీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదువున్నప్పుడు రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ప్రవేశించారు. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజీలో విద్యార్థి రాకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1970లో ఎస్ఎఫ్ఐలో చేరారు. 1973 నుండి 1979 వరకు ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సహాయ కార్యదర్శిగా పని చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కొడియేరి బాలకృష్ణన్ 20 ఏండ్ల వయస్సులోనే 16 నెలల పాటు మిసా చట్టం కింద జైలు శిక్ష అనుభవించారు. 1980 నుంచి 1982 వరకు డీవైఎఫ్ఐ కన్నూర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కేరళ అసెంబ్లీకి తలస్సేరి నియోజకవర్గం నుంచి 1982, 87, 2001, 2006, 2011ల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి 2006 వరకు వరకు కేరళ శాసససభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్నారు. అచ్యుతానంద ప్రభుత్వంలో 2006 నుంచి 2011 వరకు రాష్ట్ర హౌం మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఆయన 2015 ఫిబ్రవరి 23న తొలిసారి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మళ్లీ 2018లో రెండోసారి, 2022 మార్చిలో మూడోసారి ఎన్నిక రాష్ట్ర కార్యదర్శిగా అయ్యారు. 2022 ఆగస్టు 28న అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో ఆ బాధ్యలను గోవిందన్ మాస్టార్ స్వీకరించారు. సీపీఐ(ఎం) అధికారక మళయాళం దినపత్రిక దేశాభిమానికి ప్రధాన సంపాదుకుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి
కేరళ సీపీఐ(ఎం) రాష్ట్ర మాజి కార్యదర్శి కొడయేరి బాలకృష్ణన్ మరణం ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పేదల పక్షాన పనిచేశారని గుర్తుచేశారు. ప్రస్తుత మితవాద రాజకీయాలు దేశ విచ్ఛిన్నతకు ప్రమాదంగా మారిన తరుణంలో ఆయన మరణం తీరని లోటని తెలిపారు.
సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు బాలకృష్ణన్..
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
కొడయేరి బాలకృష్ణన్ మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరని లోటని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. కేరళలోని గ్రామీణ పేదల కోసం, వారి అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితకాలం పనిచేశారని పేర్కొన్నారు.