Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ మరో ఘనత
- లెఫ్ట్ ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో దక్కిన గుర్తింపు
- రాష్ట్రమంతా డిజిటల్ లిటరసీ సాధించాలని లక్ష్యం
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం జిల్లా పుల్లమ్పర గ్రామ పంచాయతీ ప్రత్యేక ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే పూర్తిగా డిజిటల్ లిటరసీని సాధించిన తొలి గ్రామ పంచాయతీగా నిలిచింది. గతనెల 21న ఒక బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని ప్రకటించిన విషయం విదితమే. కేరళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ఈ గ్రామ పంచాయతి డిటిజల్ లిటరసీ సాధించటంలో తగిన తోడ్పాటునందించింది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రమంతా డిజిటల్ లిటరసీని సాధించాలని కేరళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఆన్లైన్ మోడ్లో అందుబాటులో ఉన్న 800కు పైగా ప్రభుత్వ సర్వీసులను సదరు గ్రామ పంచాయతీ వాసులు పొందటమే డిజిటల్ లిటరసీ మిషన్ ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బేసిక్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించటంలో శిక్షణనిచ్చారు. దాదాపు 250 మంది ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు, కుడుంబశ్రీ సభ్యులు ఇక్కడి ప్రజలకు డిజిటల్ లిటరసీలో భాగంగా శిక్షణనిచ్చారు. ఈ మొత్తం ప్రక్రియను కేరళ టెక్నాలజికల్ యూనివర్సిటీ (కేటీయూ) పర్యవేక్షించింది. శిక్షణ తర్వాత నిర్వహించిన పరీక్షను మొత్తం 3,174 మంది (14 నుంచి 65 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారు) క్లియర్ చేశారు. దీంతో ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా డిజిటల్ లిటరసీని సాధించినట్టయ్యింది. కాగా, ఈ డిజిటల్ లిటరసీని రాష్ట్రమంతా సాధించాలని కేరళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకన్నది. అందరికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే కేరళ-ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (కే-ఫాన్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ను ప్రజలందరికీ అందిస్తామని వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్) అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన హామీని దీనితో నిలబెట్టుకున్నది.
డిజిటల్ లిటరసీ మిషన్
పుల్లమ్పుర గ్రామ పంచాయతీ డిజిటల్ లిటరసీ సాధించటం వెనక గల ప్రక్రియ ఒక పద్దతి ప్రకారం జరిగింది. ఇందులో భాగంగా 'డిజి పుల్లమ్పర'ను గతేడాది ఆగస్టు 15న ప్రారంభించారు. ఇంజినీరింగ్ కాలేజీల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు, ప్రాథమికోన్నత స్కూల్, కుడుంబశ్రీ వర్కర్లు అందించిన సహకారంతో ఈ మిషన్ నెరవేరింది. పంచాయతీలోని 15 వార్డుల్లో సర్వేను నిర్వహించారు. 3,330 మందికి వాలంటీర్లు శిక్షణనిచ్చారు. కేరళ ప్రభుత్వానికి చెందిన దాదాపు 800 ఆన్లైన్ సర్వీసులను లబ్దిదారులు పొందగలిగి ఆపరేట్ చేయగలిగేలా చేయటాన్ని ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వం అందించే సేవలను పొందటంలో డిజిటల లిటరసీ ముఖ్యమని సీఎం విజయన్ అన్నారు. కేరళను నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయటానికి ప్రభుత్వం వీలైనన్ని అన్ని ప్రయత్నాలను చేస్తున్నదని తెలిపారు.