Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21వ శతాబ్దంలో చారిత్రాత్మక రోజు
- అందరికీ ఇంటర్నెట్టే లక్ష్యం
- 5జీ సేవలు, ఐఎంసీ ఆరో ఎడిషన్‌ను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ : దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. శనివారం నాడిక్కడ ప్రగతి మైదానంలో 5జీ సేవలు, నాలుగు రోజుల పాటు జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను, 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అలాగే దేశంలోని మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్. జియో, వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ డెమో దేశంలో 5జీ సాంకేతికత సామర్థ్యాన్ని చూపించడానికి ప్రధాని మోడీ ముందు ఒక్కొక్క సంస్థ ట్రయిల్ వినియోగాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజన్‌లో ఇది అత్యంత గొప్ప ముందడుగని అన్నారు. డిజిటల్ డివైస్ ధర, కనెక్టివిటీ, డేటా ధర, డిజిటల్ ఫస్ట్ విజన్ చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం తనకుందనీ, ఆత్మ నిర్భర్ భారత్ కోసం తాను కన్న కలలను కొందరు ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 5జీ టెక్నాలజీ వల్ల టెలికాం రంగంలో విప్లవం వస్తుందనీ, అందువల్ల 5జీ సర్వీసులు ప్రారంభించటం 21వ శతాబ్దంలో దేశానికి చరిత్రాత్మకమని తెలిపారు. ఇది డిజిటల్ ఇండియా సాధించిన విజయమని చెప్పారు. 5జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో గ్రామాలు కూడా పాల్గొనడం సంతోషాన్ని ఇస్తోందన్నారు.
అందరికీ ఇంటర్నెట్ లక్ష్యం
అందరికీ ఇంటర్నెట్ లక్ష్యంపై తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. నవ భారతంలో కేవలం టెక్నాలజీ వినియోగదారుగా మిగిలిపోదనీ, ఆ సాంకేతికత అభివృద్ధి, అమలులో దేశం క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నారు. భవిష్యత్తులో వైర్లెస్ టెక్నాలజీని రూపొందించడంలోనూ, దానికి సంబంధించిన తయారీలోనూ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో 2014లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు కేవలం రెండు మాత్రమే ఉండేవని అన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 200 దాటిందని చెప్పారు. అలాగే అప్పుడు దేశం నుంచి ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఎగుమతి కాలేదనీ, ఇప్పుడు వేల కోట్ల రూపాయాలు విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు.
కొత్త శకానికి తలుపులు తట్టింది
5జీ దేశంలో కొత్త శకానికి తలుపులు తట్టిందన్నారు. 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీల కోసం ఇండియా ఇతర దేశాలపై ఆధారపడి ఉందనీ, అయితే 5జీతో ఇండియా సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఇండియా మొట్టమొదటి సారిగా టెలికాం సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను ఏర్పరుస్తుందని అన్నారు. దేశంలో సామాన్యుల అవగాహన, జ్ఞానం, పరిశోధనాత్మక మనస్సుపై తనకు ఎప్పుడూ పూర్తి నమ్మకం ఉందన్నారు. డిజిటల్ ఇండియా చిరు వర్తకులు, చిన్న వ్యాపారవేత్తలు, స్థానిక కళాకారులు, చేతివత్తుల వారికి ఒక వేదికను అందించిందని తెలిపారు.
2023 డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు : ముకేశ్ అంబానీ
2023 డిసెంబరునాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశంలోని ప్రతి పట్టణానికి, ప్రతి తాలూకాకు జియో 5జీ సర్వీసులను అందజేస్తామని చెప్పారు. 5జీ ప్రారంభమవటంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, మెటావెర్స్ వంటి 21వ శతాబ్దపు ఇతర టెక్నాలజీల సంపూర్ణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి 5జీ సేవలు పునాదివంటివని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు : సునీల్ మిట్టల్
5జీ సేవలు ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాల సముద్రాన్ని తెరుస్తుందని భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ అన్నారు. మహమ్మారి సమయంలో వ్యవస్థ అంతా గ్రామాలకు, ఇళ్లకు మారిందని, అయితే దేశం గుండె చప్పుడు ఒక్క క్షణం కూడా ఆగలేదని అన్నారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు : అశ్విని వైష్ణవ్
5జీ సేవలు ప్రారంభమైన ఈరోజు సువర్ణాక్షరాలతో రికార్డులకు ఎక్కుతుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. డిజిటల్ ఇండియాకు టెలికాం రంగం ముఖద్వారమని, పునాది అని చెప్పారు. డిజిటల్ సర్వీసెస్‌ను ప్రతి వ్యక్తి చెంతకు చేర్చే మాధ్యమమని అన్నారు.