Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల్లో 7.70, గ్రామీణంలో 5.84 శాతం
- మోడీ ప్రభుత్వం పరిష్కారం కనుగొనలేదు: ఏచూరి
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు 6.43 శాతం నమోదయింది. అందులో పట్టణ నిరుద్యోగ రేటు 7.70 శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 5.84 శాతం నమోదు అయింది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక స్పష్టం చేసింది. 15 నుంచి 24 ఏండ్ల యువకుల్లో ఉద్యోగత రేటు ఐదేండ్లలో సగానికి సగం పడిపోయింది. 2017లో యువకుల్లో 20.9 శాతం ఉద్యోగత రేటు నమోదు కాగా, 2022 నాటికి 10.4 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆగస్టులో 7.68 శాతం నుంచి సెప్టెంబరులో 5.84 శాతానికి పడిపోయింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఇది అంతకుముందు ఆగస్టులో 9.57 శాతం నుంచి సెప్టెంబర్‌లో 7.7శాతానికి పడిపోయిందని డేటా పేర్కొంది. సెప్టెంబర్‌లో అత్యధికంగా రాజస్థాన్‌లో 23.8 శాతం, జమ్మూ కాశ్మీర్లో 23.2 శాతం, హర్యానాలో 22.9 శాతం, త్రిపురలో 17 శాతం, జార్ఖండ్‌లో 12.2 శాతం, బీహార్‌లో 11.4 శాతం, గోవా 10.9 శాతం నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్నది. సెప్టెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం అత్యల్పంగా 0.1 శాతం, తరువాత అసోంలో 0.4 శాతం నమోదు అయింది.
పది రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన నిరుద్యోగ రేటు
దాదాపు పది రాష్ట్రాల్లో ఆగస్టులో కంటే సెప్టెంబర్‌లో స్వల్పంగా నిరుద్యోగ రేటు పెరిగింది. మేఘాలయలో ఆగస్టులో 2.0 శాతం నుంచి సెప్టెంబర్‌లో 2.3 శాతానికి, ఒడిశాలో 2.6 శాతం నుంచి 2.9 శాతానికి, కేరళలో 6.1 శాతం నుంచి 6.4 శాతానికి, కర్నా టకలో 3.5 శాతం నుంచి 3.8 శాతానికి స్వల్పంగా నిరుద్యోగ రేటు పెరిగింది. మహారాష్ట్రలో ఆగస్టులో 2.2 శాతం నుంచి సెప్టెంబర్‌లో 4 శాతానికి పెరిగింది. త్రిపురలో 16.3 శాతం నుంచి 17 శాతానికి, తెలంగాణలో 6.9 శాతం నుంచి 8.3 శాతానికి, పుదుచ్చేరిలో 5.2 శాతం నుంచి 7.3 శాతానికి, హిమాచల్ ప్రదేశ్‌లో 7.3 శాతం నుంచి 9.3 శాతానికి, ఢిల్లీలో 8.2 శాతం నుంచి 9.6 శాతానికి నిరుద్యోగ రేటు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం
ఆంధ్రప్రదేశ్‌లో 4.8 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయింది. ఏపీలో ఆగస్టులో 6 శాతం నుంచి సెప్టెంబర్‌లో 4.8 శాతానికి నిరుద్యోగ రేటు తగ్గింది. తెలంగాణలో 8.3 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. ఆగస్టులో 6.9 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, సెప్టెంబర్ నాటికి 8.3 శాతానికి పెరిగింది.
మోడీ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేదు: సీతారాం ఏచూరి
దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోందనీ, ఉద్యోగ రేటు తగ్గుతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అయినప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం కనుగొనలేదనీ, ఈ సంక్షోభం నుంచి బయటపడాలనే కోరిక కూడా లేదని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రగల్భాలు పలికారని, అధికారిక డేటా ప్రకారం తలసరి ఆదాయం కరోనా మహమ్మారికి ముందుకంటే ఇప్పుడే తక్కువ నమోదు అయిందని తెలిపారు. నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిందని, యువకుల్లో ఉద్యోగ రేటు 2017లో కంటే ఇప్పుడు సగానికి సగం తక్కువ నమోదు అయిందని పేర్కొన్నారు. యువత ఆత్మహత్యలు ఆందోళనకరమని అన్నారు.
మోడీ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి దారి తీస్తున్నాయని విమర్శించారు. ఉత్పత్తి రంగం పడిపోతోందని, రూపాయి విలువ చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి చేరుకుందని, వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో నమోదు అయిందని, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుందని దుయ్యబట్టారు. ధరలు పెరుగుదల అదుపు చేయలేని మోడీ ప్రభుత్వం, ప్రజల కష్టాలను మరింతగా పెంచిందని విమర్శించారు. ధనవంతులకు పన్ను రాయితీలు, కార్పొరేట్లకు భారీ స్థాయిలో రుణాలు మాఫీ ఆపాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలను కల్పించే ఉద్యోగ కల్పనకు, డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలని డిమాండ్ చేశారు.