Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, రాష్ట్రపతి, పార్టీ నేతల ఘన నివాళి..
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు కీలక నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అహింసామార్గంలో నడుస్తూ శాంతిస్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విలువలైన శాంతి, సమానత్వం, మత సామరస్యానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఆయన జయంతి ఒక సందర్భం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహాత్ముడి 153వ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు. అమత మహౌత్సవాలను నిర్వహించుకుంటున్న సందర్భంలో వచ్చిన ఈ గాంధీ జయంతి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. భారతదేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి సైతం ఢిల్లీలోని విజరు ఘాట్‌లో రాష్ట్రపతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'జై జవాన్, జై కిసాన్ నినాదమిచ్చిన శాస్త్రీజీ హరిత విప్లవం, శ్వేత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ మనందరిలో స్ఫూర్తి నింపుతాయి'' అని శాస్త్రిని ముర్ము గుర్తుచేసుకున్నారు.
ప్రధాని మోడీ కూడా రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీకి నివాళిగా ఖాదీ, దేశీయ హస్తకళల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలని సూచించారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోడీ నివాళులర్పించారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన ఇతర ప్రముఖుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు తదితరులు ఉన్నారు.