Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాఖ్య వ్యవస్థకే ముప్పు : పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్
- మోడీ హయాంలో 8371మంది అరెస్టు
- నేర నిరూపణ రేటు కేవలం 2.8శాతం...
- విచారణ పేరుతో సుదీర్ఘకాలం నిందితుల్ని జైల్లో నిర్బంధిస్తున్న ఎన్ఐఏ
- రాష్ట్రాల్ని బెదిరిస్తూ...కేసుల విచారణ ఎన్ఐఏకు బదిలీ
న్యూఢిల్లీ : ఉపా (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక) చట్టాన్ని మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నతీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నిరసన గళాన్ని వినిపిస్తున్న పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, మేథావుల్ని, విద్యార్థి సంఘం నాయకులెంతో మందిని మోడీ సర్కార్ జైల్లో నిర్బంధిస్తోంది. కొన్ని వేలమంది ఈ ఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాల పోలీసుల్ని పక్కకుపెట్టి కేసుల్ని ఎన్ఐఏకు కేంద్రం అప్పగిస్తోందని, తద్వారా దేశంలో సమాఖ్య వ్యవస్థకు ముప్పు పొంచివుందని 'పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్' తాజా నివేదిక అభిప్రాయపడింది. ఉపా చట్టం దుర్వినియోగమవుతోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని నివేదికలో పరిశోధకులు తెలిపారు. నివేదికలో పేర్కొన్న మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
8371 మంది అరెస్టు..
ఎన్సీఆర్బీ (జాతీయ నేర గణాంకాల బ్యూరో) గణాంకాల ప్రకారం, ఉపా కేసుల్లో (2015-20 మధ్యకాలంలో) సగటు నేర నిరూపణ కేవలం 2.8శాతానికే పరిమితమైందని, ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేర నిరూపణ రేటు 49.67శాతంగా ఉందని నివేదిక పేర్కొన్నది. నిందితులకు బెయిల్ రాకుండా సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించాలన్న కక్షసాధింపు వైఖరి కనపడుతోంది. ఐపీసీ కేసుల్లో అరెస్టయిన వారిలో నేర నిరూపణ రేటు 22.19శాతంగా ఉంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక విచారణలు చేపట్టినా..కేసులో తీర్పులు రావడానికి 10-15 ఏండ్లు పడుతోంది. 2015-20 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉపా చట్టం కింద 5924 కేసులు నమోదయ్యాయి. 8371 మంది అరెస్టయ్యారు. అత్యధికంగా మణిపూర్ (1965), జమ్మూకాశ్మీర్ (1163), అసోం (923), జార్ఖండ్ (501), ఉత్తర ప్రదేశ్ (385)లలో కేసుల నమోదు కనపడుతోంది.
ముస్లిం మైనార్టీ, దళిత, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందినవారు అత్యధిక సంఖ్యలో ఉపా కేసుల్లో అరెస్టయి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, విద్యార్థి సంఘం నాయకుల్ని కేంద్రం జైల్లో నిర్బంధిస్తోంది. తద్వారా వారి, వారి కుటుంబా ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొ న్నది. రాజకీయ ఖైదీలందర్నీ బెయిల్‌పై విడుదల చేయాలని కోరింది. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కోర్టు విడుదల అనంతరం బాధితులకు నష్టపరిహారం అందజేయాలని సూచించింది.
బెయిల్ రాకుండా..
మోడీ సర్కార్ హయాంలో ఉపా చట్టం దుర్వినియోగమవుతోంది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. 2015-20 మధ్యకాలంలో ఉపా కేసుల వివరాలు నిర్దిష్టంగా లేవు. కొన్ని వేలమంది కోర్టుల విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిపై ఛార్జ్‌షీట్ నమోదుచేయటానికి ఎన్ఐఏకు ఏండ్లు పడుతోంది. ఐపీసీ సెక్షన్ల కింద ఆరోపణలు కోర్టులో నిలబడక పోయే సరికి, ఉపా చట్టం కింద కేసులు పెడుతూ జైల్లో నిర్బంధిస్తున్నారు. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వచ్చాకే వాటి వివరాలు ఎన్సీఆర్బీలో కనపడుతున్నాయి. ఐపీసీ సెక్షన్లలో బెయిల్ మంజూరు కాగా, తిరిగి నిందితులపై ఉపా కింద కేసులు పెడుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి ఎన్ఐఏ 456 కేసులు నమోదు చేసింది. ఇందులో 78శాతం ఉపా చట్టం కింద నమోదైనవే. మన్మోహన్ హయాంలో (2009-14) 69 ఉపా కేసులు పెట్టారు. మోడీ సర్కార్ వచ్చాక (2015-20) ఉపా కింద 288 కేసులు నమోదయ్యాయి. ఇందులో 41 కేసుల్ని (12శాతం) సుమోటాగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది. 316 కేసులు (88శాతం) కేసులు రాష్ట్రాల నుంచి ఎన్ఐఏకు బదిలీ అయ్యాయి. రాష్ట్రాల అంగీకారంతో కేసుల బదిలీ అయ్యిందా? లేదా? అన్నదానిపై సరైన సమాచారం లేదు.