Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్రునయనాల మధ్య కొడియేరికి అంతిమవీడ్కోలు
- పాడెమోసిన సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం
- పయ్యంబాలెం బీచ్లో అంత్యక్రియలు
- తరలివచ్చిన ప్రజానీకం
కన్నూరు : ఒక పోరాట అధ్యాయం ముగిసింది. నిరంకుశత్వం, నిర్బంధం, మతోన్మాదంపై రాజీలేని పోరు సాగించిన యోధుడు కొడియేరి బాలకృష్ణన్ పయ్యంబాలెం బీచ్లో శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇ.కె. నయనార్, సీపీఐ(ఎం) పూర్వ కార్యదర్శి చడయాన్ గోవిందన్ల స్మారక చిహ్నాల మధ్య కొడియేరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. మరోవైపు అశేష ప్రజానీకం 'యోధుడా.. ఇక సెలవు' అంటూ చేసిన నినాదాలు మారుమ్రోగాయి. కన్నూరులోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుండి పయ్యంబాలెం బీచ్వరకు సాగిన అంతిమయాత్రలో దారిపొడవునా జన ప్రవాహం కదలింది. 'వీరునికి మరణం లేదు ... మా జ్ఞాపకాలలో, ఆచరణలో నీవెప్పుడూ సజీవమే' అంటూ కన్నీటితో ప్రతినచేసింది. పయ్యంబాలెం బీచ్వద్ద సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు స్వయంగా పాడి మోసి తమ సహచరునికి తుది నివాళులర్పించారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరగడమే తప్ప తడబడటం ఎరగని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గళం మొట్టమొదటిసారి తడబడింది. గుండెల నిండా విషాదం నిండటంతో సంతాపసభలో ప్రసంగాన్ని పూర్తిచేయ లేకపోయారు. గద్గద స్వరంతో 'మిత్రమా .. ఇక సెలవు' అంటూ అసంపూర్తిగా ముగించేశారు.