Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ నివాళి
న్యూఢిల్లీ : సైద్ధాంతికవేత్త, వామపక్ష ఉద్యమ అగ్రనేతల్లో ఒకరు, మహారాష్ట్రలో వ్యవసాయ కార్మికులు, గిరిజనుల నేత కుమార్ శిరాల్కర్ ఆదివారం నాసిక్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. 2019 నుంచి ఆయన కేన్సర్‌తో పోరాడుతున్నారు. 70వ దశకం తొలినాళ్లలో ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలివేసిన శిరాల్కర్ ఉత్తర మహారాష్ట్రలో గిరిజనులను సంఘటితపరిచి 'శ్రామిక్ సంఘటన'ను ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ సమయంలో ఆయన జైలు జీవితం అనుభవించారు. 80వ దశకం ప్రారంభంలో వ్యవసాయ కార్మికులను సంఘటితపరిచారు. వ్యవసాయ కార్మిక సంఘానికి మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా వున్నారు. ఏఐఏడబ్ల్యూయూ జాయింట్ కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. మహారాష్ట్రలో సీఐటీయూతో కలిసి పనిచేశారు. మహారాష్ట్రలోని చెరకు కార్మికుల దుస్థితిపై ఆయన అధ్యయనం చేశారు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలను కూలంకషంగా అవగాహన చేసుకున్న శిరాల్కర్ ఉద్యమంలో బలమైన వర్గ దృక్పథంతో సైద్ధాంతిక పోరాటాల్లో దృఢంగా నిలబడ్డారు. వివిధ అంశాలపై రెండు పుస్తకాల ను, అనేక వ్యాసాలను రాశారు. దళితులు, గిరిజనుల అభ్యున్నతికి ఆయన నిబద్ధతతో కృషి చేశారు. అనేక రచనలు చేశారు. కార్యకర్తలను చైతన్యపరచడంలో మహారాష్ట్రలో సిఐటియుకి సాయపడ్డారు. నిబద్ధత గల విప్లవ కార్యకర్త అయిన శిరాల్కర్ సాధారణ జీవితాన్ని గడిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నా గ్రామంలో గిరిజనుల మధ్యనే నివసించారు.
ఆయన మృతికి సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ తీవ్ర సంతాపాన్ని తెలియజేశాయి. ఆయన మరణం మహారాష్ట్రలో కార్మికోద్యమానికి, ప్రగతిశీల ఉద్యమానికి తీరని లోటని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. శిరాల్కర్ కృషి భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, సంయుక్త కార్యదర్శులు వి.శివదాసన్, విక్రమ్సింఫ్ు, సిడబ్ల్యుసి సభ్యులు సునీత్ చోప్రా సంతాప సందేశంలో పేర్కొన్నారు.