Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ మహాసభ దుశ్చర్య
కోల్‌కతా : దసరా పండుగల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఘనంగా జరిగే కాళీ పూజల్లో జాతిపిత మహాత్మాగాంధీకి మహాపచారం జరిగింది. హిందూ మహాసభ ఈ దుశ్చర్యకి పాల్పడింది. మితవాద గ్రూపు నిర్వహిస్తున్న ఒక పందిరిలో పూజ సందర్భంగా కాళి మాత హతమార్చే మహిషాసురుడు స్థానంలో మహాత్మాగాంధీని పోలి వుండే విగ్రహాన్ని పెట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ఆ విగ్రహాన్ని మార్చేశారు. మహాత్ముడిని హత్య చేసిన నాథూరాం గాడ్సేను, ఆ భావజాలాన్ని పెంచి పోషించేందుకు తన వంతు పాత్రను పోషిస్తున్న అఖిల భారత హిందూ మహాసభ ఈ మొత్తం వ్యవహారం వెనుక వుంది. అక్కడ పెట్టిన విగ్రహం గాంధీ మాదిరిగా వుంది కానీ గాంధీ కాదని హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూడ్ గోస్వామి వ్యాఖ్యానించారు. దసరా పందిరికి పైన పశ్చిమ బెంగాల్ చిహ్నాలంటూ రవీంద్ర నాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల పక్కనే నాథూరాం గాడ్సేల ఫోటోలు వుంచారు. ఆ పందిరిని దర్శించేవారికి వాటిని చూడడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. రవీంద్రనాథ్, స్వామి వివేకానంద వంటి వారు జాతీయ భావాల స్ఫూర్తిని మనలో నింపారని, కానీ గాడ్సే హంతకుడిగా మనందరికీ తెలిసిన వ్యక్తని, అటువంటి వారినందరిని ఒకే గాటన కట్టడం ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదని ఒక సందర్శకుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇది జాతిపితకు తీవ్ర అవమానమేనని పాలక తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి కమల్ ఘోష్ విమర్శించారు. కొంతమంది న్యాయవాదుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
సౌహార్ధ్ర భావాన్ని దెబ్బతీసేందుకు యత్నం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సలీమ్ ఖండన
హిందూ మహాసభ చర్యను సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీమ్ తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ విశిష్టమైన పాత్రను పోషించారని చెప్పారు. హిందుత్వ శక్తుల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని, ఆయన ఆదర్శాలు ఇప్పుడు ప్రతిరోజూ హత్యకు గురవుతున్నాయని తెలిపారు. దసరా సమయంలో ప్రజల సున్నితత్వాన్ని దెబ్బతీయడం, పండగ సమయాల్లో రాష్ట్రంలో ఉన్న సౌహార్ధ్ర భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని విమర్శించారు.