Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చైనాకు వెళుతున్న ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం భారత గగనతలంలో ప్రయాణిస్తుండగా, బాంబు బెదిరింపు రావడంతో భారత వైమానిక దళం సోమవారం అప్రమత్తమై, యుద్ధ విమానాలను పంపింది. అయితే బాంబు బెదిరింపును నిర్వీర్యం చేశామని టెహరాన్ నుండి సందేశం రావడంతో అక్కడికి సమస్య పరిష్కారమైందని ఐఎఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ విమానం తన ప్రయాణాన్ని కొనసాగించిందని తెలిపింది. బాంబు వుందన్న వార్తలు వెలువడగానే యుద్ద విమానాలను పంపడంతో పాటూ, అవసరమైతే జైపూర్‌లో లేదా చండీగడ్‌లో దిగాల్సిందిగా కూడా అవకాశమిచ్చామని, కానీ పైలట్ విమానాన్ని ఈ రెండు ప్రాంతాలకు మళ్లించడానికి నిరాకరించాడని ఐఎఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. కొద్ది సేపటి తర్వాత బాంబు భయాన్ని పట్టించుకోనవసరం లేదంటూ టెహరాన్ సమాచారం అందించిందని తెలిపింది. అంతర్జాతీయ నిబంధనల మేరకే తాము అన్ని చర్యలు తీసుకున్నామని ఐఎఎఫ్ తెలిపింది. భారత గగనతలం లో వున్నంతసేపూ ఆ విమానంపై ఐఎఎఫ్ నిశిత రాడార్ పర్యవేక్షణ కొనసాగిందని పేర్కొంది.