Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టు అమలులో అవకతవకలు ..నిబంధనలకు బీజేపీ సర్కార్ పాతర
- ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో పఖ్రో టైగర్ సఫారీ ప్రాజెక్ట్ కోసం 6,093 చెట్లను అక్రమంగా నరికివేసినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తరాఖండ్ అటవీ శాఖ అనుమతలు పొందింది. ఈ ప్రక్రియలో కేవలం 163 చెట్లను మాత్రమే తొలగిస్తామని అనుమతుల విజ్ఞపనలో పేర్కొంది. దానికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కానీ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లోని కలగర్ ఫారెస్ట్ డివిజన్లో టైగర్ సఫారీని ప్రారంభించేందుకు 16.21 హెక్టార్ల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా 6,093 చెట్లను అక్రమంగా నరికివేసినట్లు ఎఫ్ఎస్ఐ తన నివేదికలో పేర్కొంది. 2020 డిసెంబర్లో అప్పటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి, బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ పఖ్రో టైగర్ సఫారీకి శంకుస్థాపన చేశారు. 2019లో డిస్కవరీ ఛానల్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో షఉటింగ్ కోసం కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన సందర్భంగా సందర్శకులు పులిని చూసేందుకు వీలుగా ఆ ప్రాంతంలో సఫారీని అభివృద్ధి చేయడం గురించి ప్రధాని మోడీ చెప్పారని హరక్ సింగ్ రావత్ గుర్తు చేశారు.
ప్రాజెక్ట్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల వేలాది చెట్లను అక్రమంగా నరికివేశారని ఢిల్లీకి చెందిన పర్యావరణ కార్యకర్త, న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్ విమర్శించారు. రక్షిత ప్రాంతంలో అనేక చెట్లను నరికివేసినట్టు బన్సాల్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ అటవీ శాఖను ఎన్ని చెట్లను నరికారో సమాచారం అందించాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సెంట్రల్ జూ అథారిటీ కోరాయి. అక్రమంగా నరికివేతకు సర్వే నిర్వహించాలని అటవీ సర్వే సంస్థను అధికారులు ఆదేశించారు.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఉండే కేంద్ర సంస్థ ఎఫ్ఎస్ఐ సర్వే చేపట్టింది. ఈ ఏడాది జూన్‌లో ఎఫ్ఎస్ఐ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇటీవల ఉత్తరాఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ వినోద్ కుమార్ సింఘాల్‌కు నివేదిక సమర్పించింది. ఎఫ్ఎస్ఐ తన 81 పేజీల సర్వే నివేదికలో కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అక్రమంగా 6,093 చెట్లను నరికివేసినట్టు పేర్కొంది. తొమ్మిది నెలల్లో రూపొందించిన నివేదికలో ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు దాదాపు 16.21 హెక్టార్ల భూమిని ప్రాజెక్టు కోసం క్లియర్ చేసినట్లు కూడా పేర్కొంది. అయితే ఉత్తరాఖండ్ అటవీ శాఖ నివేదికలోని అంశాలను ఇంకా ఆమోదించలేదు. ఎఫ్ఎస్ఐ నివేదికకు సంబంధించి డిపార్ట్మెంట్ కొన్ని వివరణాత్మక పరిశీలనలు చేసి సంస్థకు పంపిందని వినోద్ సింఘాల్ తెలిపారు.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ప్రాజెక్ట్ అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించాయి. కార్బెట్ టైగర్ రిజర్వ్, కలగర్ ఫారెస్ట్ డివిజన్లో అక్రమంగా చెట్లను నరికివేయడం, నిర్మాణ కార్యకలాపాలపై వివిధ దర్యాప్తు కమిటీలు కనుగొన్న వాటిపై తమ అభిప్రాయాలను సమర్పించాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ గత నెలలో ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. పఖ్రో రేంజ్లో టైగర్ సఫారీ కోసం అటవీ భూమిని ఎందుకు మళ్లించారో పేర్కొనాల్సిందిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్యానెల్ కోరింది. ప్రాజెక్ట్‌లోని అవకతవకలపై ఇప్పటికే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్, కేంద్ర అటవీ, పర్యావరణం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కొన్ని దర్యాప్తు కమిటీలు ఉల్లంఘనలను గుర్తించాయి. కార్బెట్‌లోని బఫర్ జోన్లో అక్రమంగా చెట్లు నరికివేయడం, నిర్మాణాలు అక్రమాలకు అటవీ అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించాయి. విచారణ ప్యానెల్లు అభియోగాలు మోపిన తరువాత వారిలో చాలా మంది బదిలీ చేయబడ్డారు. సస్పెండ్‌కు గురయ్యారు.