Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో మూడు నెలలు ఉచిత బియ్యం!
- ప్రధాని మోడీ, అమిత షా దృష్టంతా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్లపైనే!
- వడ్డీరెట్లు పెంచటం వల్ల ద్రవ్యోల్బణం తగ్గదు : ఆర్థిక నిపుణులు
- ఆర్థిక విధానాలు సరిగా లేకపోవటం వల్లే దుస్థితి
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి దెబ్బకు సగటు పౌరుడి జీవితం అస్తవ్యస్తమైంది. అధిక ధరలు, నిరుద్యోగం విజృంభిస్తు న్నాయి. పాలకుల తీరు సాధారణ ప్రజలకు మింగుడు పడటం లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా మారినవేళ..కేంద్రం కేవలం వడ్డీ రెట్లను మార్చుతూ మమ అనిపించింది. వడ్డీరెట్ల పెంపుతో ద్రవ్వోల్బణం నియంత్రణలోకి వస్తుందని భావించటం పాత చింతకాయ ఆలోచన..అని ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేస్తున్న మదన్ సబ్నావిస్ విమర్శించారు. రెపొ రెట్ మార్పులు, వడ్డీ రెట్లు పెంపుదలతో సామాన్యుడి కష్టాలు పోవని, ఇన్నేండ్లుగా అమలు జేసిన ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు రావాలని ఆయన సూచించారు. మరో మూడు నెలల ఉచిత బియ్యం, వంట నూనె దిగుమతి సుంకం లేకపోవటం చాలా చిన్న విషయలని ఆయన అన్నారు.
ఎన్నికలు...ఓట్లు
ఉపశమన చర్యలు తీసుకోకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పటం వల్ల ఏమీ జరగదని ప్రతిపక్ష నాయకులు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినేలా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంకేతాలు అందాయి. దాంతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. ఉచిత రేషన్ బియ్యం లేదా గోధుమల పంపిణీ కొనసాగిస్తామని కేంద్రం హడావిడిగా ప్రకటించాల్సి వచ్చింది. ఇక వంట నూనెల ధరలు ఇప్పటికీ భయంకరమైన స్థాయిలో ఉన్నాయి. లీటర్ వంటనూనె ప్యాకెట్ సుమారుగా రూ.180పైన్నే ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం కారణం చూపి కొద్ది రోజులు కేంద్రం నెట్టుకొచ్చింది. సుదీర్ఘకాలం ఇలాగే కొనసాగితే ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ చేయిజారి పోయే ప్రమాదముందని అమిత్ షా ఆందోళన పడుతున్నాడు.
అక్కడ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టి సవాల్ విసురుతోంది. ఓటర్లు కేజ్రీవాల్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వదలిస్తే..ఈ ఫలితం 2024 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ పునాదులు కదిలే పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గితే ఫలితం ఉండదు. అందుచేతనే వంట నూనె దిగుమతులపై సుంకం, ఇతర పన్నులను విధించబోమంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పాల్సి వచ్చింది.
వడ్డీరెట్లతో మార్పు వస్తుందా?
కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐపై ఒత్తిడి తేవటం, ఆర్థిక విధానాల్ని మార్చటం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం ఇష్టమున్నట్టు ఆర్థిక విధానాల్ని అనుసరిస్తే దెబ్బతింటామని వారు అంటున్నారు. ఉదాహరణకు ఆర్బీఐ ప్రకటించిన రెపో రెట్‌పై విమర్శలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గించటం కోసమని వడ్డీ రెట్లను ఆర్బీఐ పెంచింది. ఆర్థిక వ్యవస్థలోని నగదు బ్యాంక్ డిపాజిట్లకు మరులుతాయని అంచనా వేశారు. అయితే గత అనుభవాల ప్రకారం వడ్డీరెట్లు పెంచినప్పుడల్లా..ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కేంద్ర తీసుకున్న ఆర్థిక నిర్ణయాలేనని నిపుణులు చెబుతున్నారు.