Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ దర్యాప్తులో వెల్లడి
- జేఈఈ మెయిన్స్‌లో రష్యన్ హ్యాకర్ సాయంతో పరీక్షలు రాసిన 820మంది విద్యార్ధులు
న్యూఢిల్లీ : దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటిల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు పాసయ్యేందుకు కొంతమంది విద్యార్ధులు రష్యన్ హ్యాకర్ సాయం తీసుకున్నారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. గతేడాది పరీక్షల్లో మొత్తంగా 820మంది విద్యార్ధులకు రష్యన్ హ్యాకర్ మిఖాయిల్ షర్గిన్ సహకరించినట్టు సీబీఐ మంగళవారం ఢిల్లీ కోర్టులో వెల్లడించింది. కోర్టు వెంటనే మిఖాయిల్ను రెండు రోజుల కస్టడీకి పంపింది. గత సెప్టెంబరులో 9లక్షల మందికి పైగా విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ రాశారు. నిర్దేశిత కేంద్రాల్లో కంట్రోల్ నియంత్రిత కంప్యూటర్లపై మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. కానీ మిఖాయిల్ షర్గిన్ ఈ కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్ చేశాడు. తమ అసోసియేట్లతో మాట్లాడుకునేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నాడు. ఆ అసోసియేట్లు వారి దగ్గర వున్న కంప్యూటర్లపై విద్యార్ధుల ప్రశ్నా పత్రాలకు జవాబులు రాశారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కమాటలో చెప్పాలంటే పరీక్షా కేంద్రాల వెలుపల గల టీచర్లు లేదా కోచ్‌లు విద్యార్ధుల కంప్యూటర్లను తమ అధీనంలోకి తీసుకుని, ప్రశ్నలకు జవాబులు రాశారు. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి 24మందిని అరెస్టు చేశారు. కజకస్తాన్ నుండి ఇక్కడు రాగానే మిఖాయిల్ను సోమవారం అరెస్టు చేశారు. అయితే దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలియచేసింది. మిఖాయిల్ ప్రొఫెషనల్ హ్యాకర్ అని ఐలియాన్ సాఫ్ట్‌వేర్‌ను ఛేదించాడని తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను టిసిఎస్ అందచేసింది. ఒకవేళ తన ఎలక్ట్రానిక్ పరికరాలు సిబిఐకి కావాలంటే తన సమక్షంలోనే వాటిని ఉపయోగించాలని షర్గిన్ కోర్టుకు తెలియచేశాడు. యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను తమకు వెల్లడించేలా ఆదేశించాల్సిందిగా సీబీఐ, కోర్టును కోరింది. తొలుత 20మంది విద్యార్ధులకే ఈ సాయం చేసినట్లు సీబీఐ భావించింది. కానీ ఆ తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. పలు నగరాల్లో దాడులు జరిపిన సీబీఐ అధికారులు, ల్యాప్‌టాప్‌లను, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో అనేకమంది విదేశీయుల పాత్ర కూడా వుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.